అసెంబ్లీలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు
సాక్షి, నరసాపురం(పశ్చిమగోదావరి) : ఉభయ గోదావరి జిల్లాలను కలుపుతూ నరసాపురంలో వశిష్ట గోదావరిపై వంతెన నిర్మించే అంశంపై నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు సోమవారం అసెంబ్లీలో గళమెత్తారు. 60 ఏళ్ల నుంచి అదిగో వంతెన.. ఇదిగో వంతెన అంటూ గోదావరి ప్రాంత వాసులను మభ్యపెడుతున్న బ్రిడ్జి నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉదయం ప్రశ్నోత్తరాల సమయంలో ముదునూరి వశిష్ట వారధి అంశాన్ని ప్రస్తావించారు. వశిష్ట వంతెనకు ఐదుసార్లు శంకుస్థాపనలు చేశారని పలువురు ముఖ్యమంత్రులు స్వయంగా ప్రకటనలు చేశారని చెప్పారు. రాష్ట్ర చరిత్రలో ఇన్ని సార్లు శంకుస్థాపనలు జరిగిన ప్రాజెక్టు ఏదీ లేదన్నారు. అసలు బ్రిడ్జి నిర్మాణంలో ఇంతజాప్యం ఎందుకు జరుగుతోందని ప్రశ్నించారు.
వైఎస్ మరణం శాపంగా మారింది
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపనను చేసి టెండర్లు కూడా పిలిచారని చెప్పారు. అయితే ఆయన మృతి చెందడంతో ఈ అంశాన్ని ఎవరూ పట్టించుకోలేదన్నారు. వైఎస్ మృతి చెందడం బ్రిడ్జి నిర్మాణానికి శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే పనులు దక్కించుకున్న మైటాస్ సంస్థ సంక్షోభంలో కూరుకు పోయినా కూడా వేరే సంస్థ సబ్ కాంట్రాక్టు తీసుకుందని వివరించారు. కానీ అప్పటి ప్రభుత్వం సబ్ కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించలేదన్నారు. దీంతో సదరు సబ్ కాంట్రాక్టర్ మాకు పనులు ఎందుకు అప్పగించలేదంటూ హైకోర్టును కూడా ఆశ్రయించారని చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వం కోర్టులో ఈ అంశాన్ని పరిష్కరించకుండా కొత్తగా వంతెన మంజూరైందని, కడతామని ప్రకటనలు గుప్పించిందని విమర్శించారు.
ప్రభుత్వానికి సూచన
వంతెన నిర్మాణ విషయంలో ముదునూరి అసెంబ్లీలో ప్రభుత్వం ముందు రెండు ఆప్షన్‌లు ఉంచారు. ప్రస్తుతం నరసాపురం నుంచి 216వ జాతీయ రహదారి వెళుతుందని చెప్పారు. ఈ జాతీయ రహదారికి అనుసంధానంగా తూర్పుగోదావరి జిల్లాలో శివకోడు నుంచి ఉన్న రాష్ట్ర రహదారిని సఖినేటిపల్లి మీదుగా జాతీయ రహదారిగా మార్పుచేసి అందులో భాగంగా వంతెన కూడా నిర్మించాలని సూచించారు. ఈ 23 కిలో మీటర్లు జాతీయ రహదారిగా మారిస్తే కేంద్ర ప్రభుత్వ నిధులతో వంతెనను నిర్మించవచ్చునన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వమే వంతెన నిర్మించడానికి చర్యలు చేపట్టాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment