కొత్త చట్టంతో ‘కిక్కు’పోతుంది | All Type Of Liquor Will Be Banned In West Godavari District | Sakshi
Sakshi News home page

కొత్త చట్టంతో ‘కిక్కు’పోతుంది

Published Wed, Jul 31 2019 8:44 AM | Last Updated on Wed, Jul 31 2019 8:44 AM

All Type Of Liquor Will Be Banned In West Godavari District - Sakshi

సురాపానం నిషేధం దిశగా సర్కారు అడుగులు వేస్తోంది. తొలుత మద్య నియంత్రణ చట్టానికి పదును పెడుతూ అసెంబ్లీలో బిల్లును ఆమోదించింది. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.  

సాక్షి, పశ్చిమ గోదావరి : మందు బాబుల ‘నిషా’ దింపేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ సర్కారు కీలక నిర్ణయాలు తీసుకుంది. అసెంబ్లీలోనూ మద్య నియంత్రణ బిల్లుకు ఆమోదం లభించింది.  కఠినమైన నిబంధనలు అమలు చేసేందుకు  ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మద్యం షాపుల సమయాన్ని సైతం కుదించటంతోపాటు నిబంధనలు పాటించని మద్యం దుకాణదారులపై క్రిమినల్‌ కేసులు పెట్టేలా చట్టాన్ని చేసే పనిలో నిమగ్నమైంది. ఇక జిల్లాలో ప్రభుత్వమే స్వయంగా 11 మద్యం దుకాణాలను నిర్వహించేందుకు చర్యలు చేపడుతోంది. తొలుత పైలట్‌ ప్రాజెక్టుగా 11 షాపులను ఏర్పాటు చేసి, ఫలితాలను విశ్లేషించి, భవిష్యత్‌ ప్రణాళికలు రూపొందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.  

ఆదాయం కాదు.. ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా
ప్రధాన ఆదాయ వనరుగా మద్యానికి గత    ప్రభుత్వాలు  పెద్దపీట వేస్తే .. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సర్కారు మాత్రం ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తూ ముందుకు దూసుకుపోతోంది. వందల కోట్ల ఆదాయాన్ని కాదని పాదయాత్రలో ఆనాడు ప్రతిపక్ష నేతగా మహిళల బాధలు విన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రాగానే హామీని నిలబెట్టుకునేందుకు చకాచకా అడుగులు వేస్తున్నారు. 2018లో మద్యం ద్వారా ఆదాయం రూ.1306కోట్లు ఉంటే, 2017 సంవత్సరంలో  రూ.1154.82కోట్లు మేర మద్యం విక్రయాలతో ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది. ఇలా రూ.వందలకోట్లు మేర ఆదాయాన్ని తెచ్చిపెట్టే మద్యాన్ని పూర్తిగా నిషేధించే లక్ష్యంతో సీఎం జగన్‌ పనిచేస్తున్నారు. దశలవారీగా మద్యం షాపులను నియంత్రిస్తూ, చివరి ఏడాది నాటికి మద్యపాన నిషేధాన్ని అమలు చేసేందుకు పక్కా ప్రణాళికతో సీఎం వైఎస్‌ జగన్‌ ముందుకు వెళుతున్నారు. 

కొత్త చట్టంతో ‘కిక్కు’పోతుంది
కొత్తగా ఆమోదించిన చట్టం మేరకు విక్రయాల నియంత్రణే ప్రధానాంశంగా ఉంది. జిల్లాలో మద్యం షాపులు సమయపాలన పాటించకపోవటం, ఎమ్మార్పీ ధరల ఉల్లంఘన వంటి అనేక అంశాలను కొత్త చట్టం తీవ్రంగా పరిగణిస్తోంది. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనే మద్యం షాపులు ఉండడంతో డబ్బుల సంపాదనే ధ్యేయంగా పని చేస్తున్నారు. బెల్టు షాపులు ఏర్పాటు చేయటం  సామాజిక భద్రతకు విఘాతంగా మారింది. గతంలో నిబంధనలు మీరితే నిర్వాహకులకు జరిమానాలు విధించటంతోపాటు తాత్కాలికంగా లైసెన్సులు రద్దు చేసేవారు. కొత్త చట్టంలో లైసెన్సులు తీసుకున్న మద్యం నిర్వాహకులు నిబంధనలు మీరితే క్రిమినల్‌ కేసులు సైతం పెట్టనున్నారు. ప్రభుత్వం దుకాణాల్లో మద్యం విక్రయించటం ద్వారా సమయాన్ని అతితక్కువకు కుదించేలా నిర్ణయిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం 12గంటల సమయంలో 4గంటలు కోత విధిస్తూ, 8గంటలకు తగ్గించేలా చర్యలు చేపడతారని అంటున్నారు. మద్యం దుకాణదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పేలా లేవు. 

జిల్లాలో ప్రభుత్వ మద్యం దుకాణాలు 
ఇప్పటి వరకూ జిల్లాలో 476 మద్యం దుకాణాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇటీవల మూడు నెలలు రెన్యువల్‌ చేయగా వీటిలో 123 మద్యం దుకాణాల వరకూ రెన్యువల్‌ చేయకుండా నిలిపివేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం మద్యం నియంత్రణ విషయంలో కఠినంగా వ్యవహరించే అవకాశం ఉందని గుర్తించిన మద్యం వ్యాపారులు ఇతర మార్గాలను అన్వేషించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ సెప్టెంబర్‌ నెలాఖరు నాటికి ప్రస్తుతం ఉన్న మద్యం పాలసీ గడువు ముగుస్తుండడంతో అక్టోబర్‌ నుంచి కొత్త పాలసీ అమల్లోకి రానుంది. ఇక నూతన పాలసీలో ఎటువంటి విధివిధానాలు ఖరారు చేస్తారనే విషయంపై సర్వత్రా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. 

ప్రభుత్వషాపులపై నివేదిక
జిల్లాలో ప్రభుత్వమే 11మద్యం దుకాణాలను పైలట్‌ ప్రాజెక్టుగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే జిల్లాలోని ఏలూరు, భీమవరం సర్కిల్స్‌లో ప్రభుత్వ మద్యం దుకాణాలు ఎక్కడ పెట్టాలో కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసి ప్రభుత్వానికి నివేదించారు. ఏలూరు పరిధిలో 5షాపులు, భీమవరం పరిధిలో 6షాపులు ఏర్పాటు చేయనున్నారు.  ఏలూరు సర్కిల్‌లో  బాపిరాజుగూడెం, తిమ్మాపురం, బీ.కొండేపాడు, మార్కొండపాడు, శ్రీనివాసపురం, భీమవరం సర్కిల్‌లో కొణితివాడ, తణుకు అర్బన్, చించినాడ, కొతలపర్రు, జిన్నూరు, ఎల్‌ఎన్‌పురాలలో ప్రభుత్వ మద్యం షాపుల ఏర్పాటుకు అధికారులు యత్నిస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement