కల్యాణం.. కమనీయం
సాక్షి, హైదరాబాద్: భక్తుల కొంగు బంగారమైన కొమురవెల్లి మల్లన్న కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆదివారం సరిగ్గా 12.03 గంటలకు మార్గశిర, భాద్రపద ద్వాదశి శుభ ఘడియల్లో వీర శైవ అర్చకులు వేద మంత్రాల మధ్య మల్లికార్జునస్వామి, మేడలాదేవి, కేతమ్మదేవిలకు మంగళ సూత్ర ధారణ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి హరీశ్‌రావు ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు స్వామికి సమర్పించా రు. ఉజ్జయిని పీఠాధిపతి సిద్దిలింగ శివాచార్య మహాస్వామి వివాహ క్రతువును పర్యవేక్షించారు. ఉదయం 10 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ దంపతులు ఆలయానికి చేరుకొని..
మూలవిరాట్ వద్ద కల్యాణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం గర్భగుడి నుంచి మల్లికార్జున స్వామి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో మంగళ వాయిద్యాలతో తోట బావి వద్ద ఏర్పాటు చేసిన కల్యాణ మండపానికి తీసుకొచ్చారు. కొత్తగా చేయించిన వెండి సింహాసనంపై స్వామిని కూర్చోబెట్టారు. తర్వాత వధువులు మేడలమ్మ, కేతమ్మను పల్లకీలో మండపం వద్దకు తీసుకువచ్చారు. మల్ల్లన్న తరఫున పడిగన్న గారి వంశ వారసులు మల్లయ్య దంపతులు, వధువుల తరఫున మహాదేవుని వంశస్తులు మల్లిఖార్జున దంపతులు కాళ్లు కడిగి కన్యాదానం చేశారు. వీర శైవ ఆగమ శాస్త్రం ప్రకారం అర్చక స్వాములు వేద మంత్రాలతో బాసిక ధారణ, గుడజీరికాధారణ (జీలకర్రబెల్లం) క్రతువును పూర్తి చేశారు.
తగ్గిన భక్త జన సందడి
పెద్ద నోట్ల రద్దు, చలి తీవ్రత, ఆలయ పాలకుల పలు వివాదాస్పద నిర్ణయాలు తదితర కారణాలతో ఈ ఏడాది మల్లన్న కల్యాణానికి అంచనా వేసినంతగా భక్తులు రాలేదు. 40 వేల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేసినా 10 వేల లోపే హాజరయ్యారు. వచ్చినవారికి కనీసం మంచి నీళ్లను ఇవ్వటంలో అధికారులు విఫలమయ్యారు. కనీసం నల్లాలు కూడా బాగు చేయించలేకపోయారు.
భక్తుల విశ్వాసాలే శిరోధార్యం: హరీశ్
దేవాలయాల్లో భక్తుల విశ్వాసాలను నూటికి నూరు పాళ్లు గౌరవించి తీరుతామని, వారి మనోభావాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పని చేయదని మంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు. మల్లన్న విగ్రహం ఎలా ఉండాలని భక్తులు కోరుకుంటారో అలానే ఉంటుందన్నారు. మల్లన్న మూల విగ్రహాన్ని మార్చుతారని, ఎల్లమ్మ తల్లి వద్ద బలి పీఠాలు ఏర్పాటు చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో భక్తులకు హరీశ్ ఈ మేరకు హామీనిచ్చారు. రూ.1.20 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులు చేపట్టినట్టు తెలిపారు.