Komuravelli Mallanna Kalyanam
-
వైభవంగా కొమురవెల్లి మల్లన్న కళ్యాణం
కొమురవెల్లి(సిద్దిపేట): సిద్దిపేట జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొమురవెల్లిలో మల్లికార్జున స్వామి కళ్యాణం ఆదివారం అంగరంగా వైభవంగా జరిగింది. స్వామివారి కళ్యాణ వేడుకలను తిలకించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. కళ్యాణ వేదికతో పాటు పరిసర ప్రాంతాలు మల్లన్న నామస్మరణతో మారుమోగాయి. వీరశైవ ఆగమ శాస్త్ర ప్రకారం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని పీఠాధిపతి సిద్ధలింగ రాజదేశికేంద్ర శివాచార్యమహాస్వామి ఆధ్వర్యంలో కళ్యాణం జరిగింది. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, జనగామ శాసన సభ్యుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి.. స్వామి వారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ గర్భగుడిలోని స్వామి వారి మూల విరాట్టును దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ స్వామి వారి కృపతో తమ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అములు చేస్తుందన్నారు. గత ప్రభుత్వం తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిందని అన్నారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ వచ్చే సంవత్సరం జరిగే కళ్యాణం నాటికి మేడలమ్మ, కేతమ్మ అమ్మవార్లకు బంగారు కిరీటాలు చేయించాలని ఆలయ ఈవోను ఆదేశించినట్లు తెలిపారు. స్వామి వారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, మంత్రి సురేఖ కుటుంబ సమేతంగా ‘పట్నం’వేసి కొమురవెల్లి మల్లికార్జున స్వామి మొక్కును తీర్చుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. -
Komuravelli : వైభవంగా కొమురవెల్లి మల్లన్న కల్యాణం (ఫొటోలు)
-
వైభవంగా కొమురవెల్లి మల్లన్న కల్యాణం
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జునస్వామి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆదివారం జరిగిన స్వామివారి కల్యాణ వేడుకలను తిలకించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా నుంచి 30 వేలమంది భక్తు లు తరలివచ్చారు. వీరశైవ ఆగమ శాస్త్ర ప్రకారం మల్లికార్జునస్వామి, బలిజె మేడలమ్మ, గొల్ల కేతమ్మకు మధ్యాహ్నం 12.11 గంటలకు వివాహం జరిగింది. స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మల్లారెడ్డి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిలు సమర్పించారు. కల్యాణం కాగానే మంత్రులు గర్భగుడిలోని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నిధుల నుంచి రూ.90 లక్షలతో చేయించిన బంగారు కిరీటాన్ని స్వామి వారికి అలంకరించారు. రూ.రెండుకోట్లతో విస్తరించిన ముఖ మండపాన్ని కూడా ప్రారంభించారు. అంతకుముందు కల్యాణ వేదిక వద్ద భక్తులనుద్దేశించి మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు కొమురవెల్లి మల్లన్న దయతోనే పూర్తయిందన్నారు. వచ్చే ఏడాది జరిగే కల్యాణం నాటికి మేడలమ్మ, కేతమ్మ అమ్మవార్లకు కూడా బంగారు కిరీటాలు చేయిస్తామని హామీ ఇచ్చారు. స్వామివారి కల్యాణంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ఒంటేరు ప్రతాప్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నాగపూరి రాజలింగం తదితరులు హాజరయ్యారు. -
కల్యాణం.. కమనీయం
సాక్షి, హైదరాబాద్: భక్తుల కొంగు బంగారమైన కొమురవెల్లి మల్లన్న కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆదివారం సరిగ్గా 12.03 గంటలకు మార్గశిర, భాద్రపద ద్వాదశి శుభ ఘడియల్లో వీర శైవ అర్చకులు వేద మంత్రాల మధ్య మల్లికార్జునస్వామి, మేడలాదేవి, కేతమ్మదేవిలకు మంగళ సూత్ర ధారణ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి హరీశ్‌రావు ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు స్వామికి సమర్పించా రు. ఉజ్జయిని పీఠాధిపతి సిద్దిలింగ శివాచార్య మహాస్వామి వివాహ క్రతువును పర్యవేక్షించారు. ఉదయం 10 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ దంపతులు ఆలయానికి చేరుకొని.. మూలవిరాట్ వద్ద కల్యాణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం గర్భగుడి నుంచి మల్లికార్జున స్వామి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో మంగళ వాయిద్యాలతో తోట బావి వద్ద ఏర్పాటు చేసిన కల్యాణ మండపానికి తీసుకొచ్చారు. కొత్తగా చేయించిన వెండి సింహాసనంపై స్వామిని కూర్చోబెట్టారు. తర్వాత వధువులు మేడలమ్మ, కేతమ్మను పల్లకీలో మండపం వద్దకు తీసుకువచ్చారు. మల్ల్లన్న తరఫున పడిగన్న గారి వంశ వారసులు మల్లయ్య దంపతులు, వధువుల తరఫున మహాదేవుని వంశస్తులు మల్లిఖార్జున దంపతులు కాళ్లు కడిగి కన్యాదానం చేశారు. వీర శైవ ఆగమ శాస్త్రం ప్రకారం అర్చక స్వాములు వేద మంత్రాలతో బాసిక ధారణ, గుడజీరికాధారణ (జీలకర్రబెల్లం) క్రతువును పూర్తి చేశారు. తగ్గిన భక్త జన సందడి పెద్ద నోట్ల రద్దు, చలి తీవ్రత, ఆలయ పాలకుల పలు వివాదాస్పద నిర్ణయాలు తదితర కారణాలతో ఈ ఏడాది మల్లన్న కల్యాణానికి అంచనా వేసినంతగా భక్తులు రాలేదు. 40 వేల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేసినా 10 వేల లోపే హాజరయ్యారు. వచ్చినవారికి కనీసం మంచి నీళ్లను ఇవ్వటంలో అధికారులు విఫలమయ్యారు. కనీసం నల్లాలు కూడా బాగు చేయించలేకపోయారు. భక్తుల విశ్వాసాలే శిరోధార్యం: హరీశ్ దేవాలయాల్లో భక్తుల విశ్వాసాలను నూటికి నూరు పాళ్లు గౌరవించి తీరుతామని, వారి మనోభావాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పని చేయదని మంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు. మల్లన్న విగ్రహం ఎలా ఉండాలని భక్తులు కోరుకుంటారో అలానే ఉంటుందన్నారు. మల్లన్న మూల విగ్రహాన్ని మార్చుతారని, ఎల్లమ్మ తల్లి వద్ద బలి పీఠాలు ఏర్పాటు చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో భక్తులకు హరీశ్ ఈ మేరకు హామీనిచ్చారు. రూ.1.20 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులు చేపట్టినట్టు తెలిపారు.