కొమురవెల్లి(సిద్దిపేట): సిద్దిపేట జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొమురవెల్లిలో మల్లికార్జున స్వామి కళ్యాణం ఆదివారం అంగరంగా వైభవంగా జరిగింది. స్వామివారి కళ్యాణ వేడుకలను తిలకించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. కళ్యాణ వేదికతో పాటు పరిసర ప్రాంతాలు మల్లన్న నామస్మరణతో మారుమోగాయి.
వీరశైవ ఆగమ శాస్త్ర ప్రకారం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని పీఠాధిపతి సిద్ధలింగ రాజదేశికేంద్ర శివాచార్యమహాస్వామి ఆధ్వర్యంలో కళ్యాణం జరిగింది. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, జనగామ శాసన సభ్యుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి.. స్వామి వారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ గర్భగుడిలోని స్వామి వారి మూల విరాట్టును దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ స్వామి వారి కృపతో తమ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అములు చేస్తుందన్నారు. గత ప్రభుత్వం తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిందని అన్నారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ వచ్చే సంవత్సరం జరిగే కళ్యాణం నాటికి మేడలమ్మ, కేతమ్మ అమ్మవార్లకు బంగారు కిరీటాలు చేయించాలని ఆలయ ఈవోను ఆదేశించినట్లు తెలిపారు.
స్వామి వారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, మంత్రి సురేఖ కుటుంబ సమేతంగా ‘పట్నం’వేసి కొమురవెల్లి మల్లికార్జున స్వామి మొక్కును తీర్చుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment