మల్లికార్జునస్వామి కల్యాణ వేడుక
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జునస్వామి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆదివారం జరిగిన స్వామివారి కల్యాణ వేడుకలను తిలకించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా నుంచి 30 వేలమంది భక్తు లు తరలివచ్చారు. వీరశైవ ఆగమ శాస్త్ర ప్రకారం మల్లికార్జునస్వామి, బలిజె మేడలమ్మ, గొల్ల కేతమ్మకు మధ్యాహ్నం 12.11 గంటలకు వివాహం జరిగింది.
స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మల్లారెడ్డి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిలు సమర్పించారు. కల్యాణం కాగానే మంత్రులు గర్భగుడిలోని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నిధుల నుంచి రూ.90 లక్షలతో చేయించిన బంగారు కిరీటాన్ని స్వామి వారికి అలంకరించారు.
రూ.రెండుకోట్లతో విస్తరించిన ముఖ మండపాన్ని కూడా ప్రారంభించారు. అంతకుముందు కల్యాణ వేదిక వద్ద భక్తులనుద్దేశించి మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు కొమురవెల్లి మల్లన్న దయతోనే పూర్తయిందన్నారు. వచ్చే ఏడాది జరిగే కల్యాణం నాటికి మేడలమ్మ, కేతమ్మ అమ్మవార్లకు కూడా బంగారు కిరీటాలు చేయిస్తామని హామీ ఇచ్చారు. స్వామివారి కల్యాణంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్ ఒంటేరు ప్రతాప్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నాగపూరి రాజలింగం తదితరులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment