కుమారుడికి ప్రథమ చికిత్స చేస్తున్న మణికుమార్
శ్రీకాకుళంలో ఓ లెక్చరర్ అవస్థ
హిమోఫీలియాతో బాధ పడుతున్న కుమారులు
అత్యవసరం కోసం ప్రథమ చికిత్స నేర్చుకున్న తల్లిదండ్రులు
తండ్రిని బదిలీ చేసిన ప్రభుత్వం..
శ్రీకాకుళం: బదిలీ బాధలు తప్పించుకోలేక, చిన్న గాయానికే పెద్దగా రక్తస్రావమయ్యే హిమోఫీలియాతో బాధపడుతున్న తన కుమారులను వదిలివెళ్లలేక శ్రీకాకుళంకు చెందిన ఒక లెక్చరర్ అవస్థలు పడుతున్నారు. శ్రీకాకుళంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేసిన మణికుమార్‌కు ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కుమారుడు రాజా అవినాశ్ డిగ్రీ చదువుతుంటే చిన్న కుమారుడు రాజా ఆశిష్ డిప్లమో చేస్తున్నాడు.
వీరిద్దరికీ హిమోఫీలియా ఉండటంతో తల్లిదండ్రులే కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. తమ కుమారులకు అత్యవసర సమయాల్లో చికిత్స అందించేందుకు వారు ప్రథమ చికిత్స చేయడం నేర్చుకున్నారు. ఈ వ్యాధిగ్రస్తులకు నిపుణులే వైద్యం చేయాల్సి ఉంటుంది. ఇంజెక్షన్ ఇవ్వడం కూడా నిపుణుల సూచనతో, పర్యవేక్షణలో జరగాలి. అత్యవసర పరిస్థితుల్లో వినియోగించాల్సిన ఇంజక్షన్‌లు కూడా ఇపుడు దొరకడంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న మణికుమార్‌ను శ్రీకాకుళం నుంచి పాడేరుకు గతేడాది అక్టోబర్‌లో బదిలీ చేశారు. అయితే హిమోఫీలియాతో బాధపడే పిల్లలు ఉంటే వారిని బదిలీ చేయకూడదన్న నిబంధన ఉంది. అయినా బదిలీ చేయడంతో మణికుమార్ కుమారులను వదిలి వెళ్లలేక అప్పటి నుంచి ఇంటి వద్దనే ఉండిపోయారు. దీంతో జీతం లేకుండా ఐదు నెలలుగా అవస్థలు పడుతున్నారు.
తన బదిలీ నిలిపివేయాలని ఆయన రాష్ట్ర టెక్నికల్ బోర్డు డెరైక్టరుకు లిఖితపూర్వకంగా దరఖాస్తు చేశారు. దానిని అధికారులు పట్టించుకోకపోవడంతో గడచిన నెలలో మరోమారు దరఖాస్తు చేసుకున్నారు. అయితే మార్చి మొదటివారంలో మణికుమార్‌ను శ్రీకాకుళంకు బదులుగా విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం బదిలీ చేశారు. దీంతో తనకున్న ఇబ్బందుల వల్ల మణికుమార్ గుమ్మలక్ష్మీపురంలో జాయిన్ కాలేదు. తన ఇబ్బందిని గుర్తించి ఇప్పటికైనా అధికారులు స్పందించి శ్రీకాకుళం బదిలీ చేసి తనకు న్యాయం చేయాలని మణికుమార్ వేడుకుంటున్నారు.