govt polytechnic college
-
సర్కారీ పాలిటెక్నిక్కే సై
సాక్షి, హైదరాబాద్: డిప్లొమా కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు ఎక్కువగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలనే ఎంచుకున్నారు. ప్రభుత్వ, ఎయిడెడ్ పాలిటెక్నిక్ కాలేజీలు 55 ఉండగా, వీటిల్లో 91.69 శాతం సీట్లు కేటాయించారు. 63 ప్రైవేటు కాలేజీల్లో కేవలం ఐదింటికి మాత్రమే విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చారు. దీంతో 60.34 శాతం మాత్రమే సీట్లు కేటాయించారు. టెన్త్ తర్వాత పాలిటెక్నిక్ డిప్లొమా ప్రవేశాలకు సంబంధించి రాష్ట్ర టెక్నికల్ ఎడ్యుకేషన్ నిర్వహించిన పాలిసెట్‌కు 79,051 మంది అర్హత సాధించారు. తొలిదశ కౌన్సెలింగ్‌లో 25,146 మంది 5,96,613 ఆప్షన్లు ఇచ్చారు. వీటిని పరిశీలించిన పాలిసెట్ విభాగం గురువారం మొదటి విడత సీట్లను కేటాయించింది. డిప్లొమా దశలోనూ కంప్యూటర్ కోర్సుల వైపే.. పాలిటెక్నిక్‌లో దాదాపు 25 బ్రాంచీలున్నాయి. వీటిల్లో 28,083 సీట్లు అందుబాటులో ఉన్నాయి. తొలివిడత ఆప్షన్లకు అనుగుణంగా 20,695 (73.69 శాతం) సీట్లు కేటాయించారు. ఇందులో విద్యార్థులు అత్యధికంగా కంప్యూటర్ సైన్స్ కోర్సులకే ప్రాధాన్యం ఇచ్చారు. కంప్యూటర్స్‌లో 4,110 సీట్లు ఉండగా వందశాతం కేటాయించారు. దీనికి అనుబంధ కోర్సుగా చెప్పుకునే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్‌లో మొత్తం 178 సీట్ల(వంద శాతం)కూ విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చారు. సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ అండ్ సెక్యూరిటీలో ఉన్న 59 సీట్లూ తొలి కౌన్సెలింగ్‌లోనే భర్తీ అయ్యాయి. క్లౌడ్ కంప్యూటింగ్ (100 శాతం) వైపు విద్యార్థులు ఆసక్తి చూపారు. సంప్రదాయ కోర్సులైన సివిల్ ఇంజనీరింగ్ (67.7 శాతం), మెకానికల్ (48.63 శాతం) మాత్రమే విద్యార్థులు ఎంచుకున్నారు. నెలాఖరులోగా రిపోర్టింగ్ తొలి విడత కేటాయింపులో సీటు దక్కించుకున్న అభ్యర్థులు ఈ నెలాఖ రులోగా సెల్ఫ్ రిపోర్టి్టంగ్ చేయాల్సి ఉంటుంది. tspolycet.nic.in అనే వెబ్‌సైట్‌కు లాగిన్ అయి, అలాట్మెంట్ ఆర్డర్‌తోపాటు అవసరమైన ధ్రువపత్రాలు అప్లోడ్ చేసి, నిర్ధారించిన ఫీజు ఆన్లైన్ ద్వారా చెల్లించవచ్చు. తుదిదశ వరకూ అభ్యర్థులు కౌన్సెలింగ్‌లో పాల్గొనే చాన్స్ ఉంటుంది. -
దేశంలో ఎక్కడా లేని విధంగా.. ‘నాడు-నేడు’కు 11 వేల కోట్లు
సాక్షి, గుంటూరు: విద్యావ్యవస్థలో అనేక సంస్కరణలు తెచ్చామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. మంగళవారం ఆయన క్రోసూరు మండలం విప్పర్లలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల భవనాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నంబూరు శంకర్రావు, అంబటి రాంబాబు, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, కలెక్టర్ వివేక్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యావ్యవస్థలో పెను మార్పులు తీసుకొచ్చిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇవ్వాలన్న ఆలోచనతో ముందుకెళ్తున్నారన్నారు. విద్యారంగంపై ఎక్కువ నిధులు ఖర్చు పెట్టిన ప్రభుత్వం దేశంలోనే లేదని.. విద్యావ్యవస్థలో నాడు-నేడు కింద రూ.11 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న నాడు-నేడు పనుల్ని తెలంగాణ అధికారులు కూడా వచ్చి పరిశీలించారని, ‘నాడు-నేడు’ను తెలంగాణలో కూడా అమలు చేయడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోందని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. చదవండి: సీఎం జగన్ సమక్షంలో ‘దిశ యాప్’ లైవ్ డెమో దిశ యాప్ డౌన్లోడ్ ఇలా.. -
వైఎస్ శకం..విద్యకు నవయుగం
సాక్షి,గుంటూరు : ‘ప్రతి విద్యార్థి భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలి. అక్షరజ్ఞానంతో అభివృద్ధి పథంలో పయనించాలి. సమాజంలో చదువుల విప్లవం రావాలి. కార్పొరేట్ స్థాయి విద్య కార్మికుడి బిడ్డకు కూడా అందాలి. ప్రతిభ ముందు పేదరికం తలవంచాలి. ఇంటికో ఇంజినీర్ తయారవ్వాలి.. ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటాలి’.. ఇది దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆకాంక్ష. అందుకు అనుగుణంగానే ఆయన పని చేశారు. ఈ క్రమంలోనే మొదటి సారి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో క్రోసూరుకు ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను మంజూరు చేశారు. అంతటితో ఆగకుండా మరో అడుగు ముందుకేసి మోడల్ స్కూల్ నిర్మాణానికి సంకల్పించారు. ఎందరో విద్యా కుసుమాల ఉజ్వల భవిష్యత్తుకు శ్రీకారం చుట్టారు. ఇచ్చిన మాట ప్రకారం దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ 2009లో మండల కేంద్రంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, మోడల్‌స్కూల్, కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాల ఏర్పాటు చేశారు. ఇప్పటికీ 9 బ్యాచ్‌ల విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సు పూర్తి చేసుకున్నారు. అప్పట్లో ఫీజు రీయింబర్స్మెంట్ కూడా విద్యార్థులకు అందింది. అదే విధంగా పేద విద్యార్థులకు ఇంగ్లిషు మీడియంలో బోధన అందించి ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా చదువులు అందించాలన్న కాంక్షతో 2009 లో నిధులు కేటాయించగా 2013 లో భవనాలు పూర్తిచేసుకుని పాఠశాల ప్రారంభమైంది. ప్రవేశ పరీక్షల ద్వారా ఆరవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. తరగతికి 80 మంది విద్యార్థులు చొప్పున ప్రతిఏటా 650 మంది విద్యార్థులు చదువులు కొనసాగిస్తున్నారు. బాలికల హాస్టల్, కస్తూర్బాగాంధీ పాఠశాల ద్వారా ఎంతో పేద బాలికలకు చదువుకోగల్గుతున్నారు. అయితే మొత్తం అభివృద్ధిని నేనే చేశానని చెప్పుకునే టీడీపీ నాయకులు ఈ ఐదేళ్ల కాలంలో ఒక్క కొత్త విద్యాసంస్థను నెలకొల్పకపోగా, రేషనలైజేషన్‌లో పేరుతో ఎస్సీ బాలికల సంక్షేమ వసతి గృహాన్ని మూసివేశారు. మాలాంటి పేద విద్యార్థులకు వరం నేను మోడల్ స్కూల్లో ఏడో తరగతి నుంచి చదువుతున్నా. ప్రస్తుతం ఇంటర్ రెండో సంవత్సరం. స్థానికంగా కాలేజీ ఉండటం మాలాంటి ఆడపిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రైవేట్ కాలేజీలో వేల రూపాయల ఫీజులు చెల్లించలేం. ఈ ఏడాది నీట్ కోచింగ్ కూడా ఇస్తున్నారు. – వీ వాణి, సీనియర్ ఇంటర్, ఎంపీసీ నాణ్యమైన విద్య.. మోడల్ స్కూల్ ఏర్పాటు చేసినప్పటి నుంచి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుంది. ఎందరో పేద విద్యార్థులు కార్పొరేట్ స్థాయి చదువులకు దగ్గరయ్యారు. విద్యార్థుల మెరిట్ కోసం నిరంతం కృషి చేస్తున్నాం. – ఝాన్సీవాణి, మోడల్‌స్కూల్ ప్రిన్స్‌పాల్ -
ఉండలేక.. ఉద్యోగానికి వెళ్లలేక
శ్రీకాకుళంలో ఓ లెక్చరర్ అవస్థ హిమోఫీలియాతో బాధ పడుతున్న కుమారులు అత్యవసరం కోసం ప్రథమ చికిత్స నేర్చుకున్న తల్లిదండ్రులు తండ్రిని బదిలీ చేసిన ప్రభుత్వం.. శ్రీకాకుళం: బదిలీ బాధలు తప్పించుకోలేక, చిన్న గాయానికే పెద్దగా రక్తస్రావమయ్యే హిమోఫీలియాతో బాధపడుతున్న తన కుమారులను వదిలివెళ్లలేక శ్రీకాకుళంకు చెందిన ఒక లెక్చరర్ అవస్థలు పడుతున్నారు. శ్రీకాకుళంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేసిన మణికుమార్‌కు ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కుమారుడు రాజా అవినాశ్ డిగ్రీ చదువుతుంటే చిన్న కుమారుడు రాజా ఆశిష్ డిప్లమో చేస్తున్నాడు. వీరిద్దరికీ హిమోఫీలియా ఉండటంతో తల్లిదండ్రులే కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. తమ కుమారులకు అత్యవసర సమయాల్లో చికిత్స అందించేందుకు వారు ప్రథమ చికిత్స చేయడం నేర్చుకున్నారు. ఈ వ్యాధిగ్రస్తులకు నిపుణులే వైద్యం చేయాల్సి ఉంటుంది. ఇంజెక్షన్ ఇవ్వడం కూడా నిపుణుల సూచనతో, పర్యవేక్షణలో జరగాలి. అత్యవసర పరిస్థితుల్లో వినియోగించాల్సిన ఇంజక్షన్లు కూడా ఇపుడు దొరకడంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న మణికుమార్‌ను శ్రీకాకుళం నుంచి పాడేరుకు గతేడాది అక్టోబర్‌లో బదిలీ చేశారు. అయితే హిమోఫీలియాతో బాధపడే పిల్లలు ఉంటే వారిని బదిలీ చేయకూడదన్న నిబంధన ఉంది. అయినా బదిలీ చేయడంతో మణికుమార్ కుమారులను వదిలి వెళ్లలేక అప్పటి నుంచి ఇంటి వద్దనే ఉండిపోయారు. దీంతో జీతం లేకుండా ఐదు నెలలుగా అవస్థలు పడుతున్నారు. తన బదిలీ నిలిపివేయాలని ఆయన రాష్ట్ర టెక్నికల్ బోర్డు డెరైక్టరుకు లిఖితపూర్వకంగా దరఖాస్తు చేశారు. దానిని అధికారులు పట్టించుకోకపోవడంతో గడచిన నెలలో మరోమారు దరఖాస్తు చేసుకున్నారు. అయితే మార్చి మొదటివారంలో మణికుమార్‌ను శ్రీకాకుళంకు బదులుగా విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం బదిలీ చేశారు. దీంతో తనకున్న ఇబ్బందుల వల్ల మణికుమార్ గుమ్మలక్ష్మీపురంలో జాయిన్ కాలేదు. తన ఇబ్బందిని గుర్తించి ఇప్పటికైనా అధికారులు స్పందించి శ్రీకాకుళం బదిలీ చేసి తనకు న్యాయం చేయాలని మణికుమార్ వేడుకుంటున్నారు.