
బలిపీఠానికి మొక్కుతున్న శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన , సతీమణి జయంతి పుష్పకుమారి, చదలవాడ కృష్ణమూర్తి
సాక్షి, తిరుమల : శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఆదివారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. వేకువజాము 3 గంటలకు సుప్రభాతసేవ, తర్వాత ఉదయం 6 గంటలకు నైవేద్య విరామ సమయం అనంతరం ఆయన ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. సతీమణి జయంతి పుష్పకుమారి, కుమారుడు దహం తారక, ఇతర కుటుంబ సభ్యులు, శ్రీలంక ప్రతినిధులు మొత్తం 40 మందితో కలసి ఆలయానికి చేరుకున్నారు. ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకున్నారు. తర్వాత పచ్చకర్పూరపు వెలుగులో గర్భాలయ మూలమూర్తిని దర్శించుకున్నారు. తర్వాత వకుళమాతను దర్శించుకుని, హుండీలో కానుకలు సమర్పించారు. రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేశారు. టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు పట్టువస్త్రంతో సత్కరించారు. శ్రీవారి చిత్రపటం, లడ్డూ ప్రసాదాలు అందజేశారు. మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, బోర్డు సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి, జేఈవో పోల భాస్కర్ ఉన్నారు.
డ్రైవర్ కోసం శ్రీలంక అ«ధ్యక్షుడి నిరీక్షణ.. పరుగులు తీసిన యంత్రాంగం
శ్రీలంక అధ్యక్షుడు శ్రీవారిని దర్శించుకుని తిరుగుప్రయాణం కోసం కారులో కూర్చున్నారు. అదే సమయంలో కారు డ్రైవర్ ఆలయంలోనే ఉన్నాడు. దీంతో ఖంగారు పడిన తిరుపతి అర్భన్‌జిల్లా ఎస్‌పి జయలక్ష్మి భద్రతాధికారును చివాట్లు పెట్టి ఆలయంలో ఉండే డ్రైవర్‌ను తీసుకొచ్చే ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ పది నిమిషాల తర్వాత డ్రైవర్ పరుగులు తీస్తూ కారు వద్దకు వచ్చారు. అప్పటికే కారులో ఉన్న అధ్యక్షుడితోనే కారును వెనక్కు తిప్పుకుని తిరుగుప్రయాణం అయ్యారు. ఈ ఘటనపై ఎస్‌పీ జయలక్ష్మి ఆలయ డెప్యూటీఈవో కోదండరామారావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక దేశాధ్యక్షుడి హోదాలో వచ్చిన వీవీఐపీ కారు డ్రైవర్‌ను తమ అనుమతి లేకుండా శ్రీవారి దర్శనానికి ఎలా తీసుకెళతారు? జరిగిన జాప్యానికి ఎవరు బాధ్యత వహిస్తారు? అంటూ మండిపడ్డారు. దీంతో ఆలయ డెప్యూటీఈవో రామారావు తమకేమి సంబంధం లేదన్నట్టుగా నవ్వుతూ ఉండిపోయారు.
శ్రీవారికి హెచ్‌సీఎల్ అధినేత శివ్‌నాడార్ రూ. కోటి విరాళం
హెచ్‌సీఎల్ అధినేత శివ్‌నాడార్ ఆదివారం తిరుమల శ్రీవారికి రూ.కోటి విరాళం ఇచ్చారు. కుటుంబ సభ్యులతో కలసి ఆయన ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావును కలసి రూ.కోటి డీడీ అందజేశారు. ఈ మొత్తాన్ని సర్వశ్రేయ ట్రస్టుకు వాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా శివ్‌నాడార్‌ను శ్రీవారి పట్టువస్త్రం, లడ్డూ ప్రసాదాలతో ఈవో సాంబశివరావు సత్కరించారు. శ్రీవారిని దర్శించుకున్న ప్రతిసారి శివ్‌నాడార్ శ్రీవారికి భారీ స్థాయిలో విరాళం సమర్పించటం ఆనవాయితీ.