
'అనంత' శ్రీమంతులు..!
ఉద్యోగ, వ్యాపార రీత్యా సొంతూరి నుంచి వెళ్లిపోయి ఎక్కడెక్కడో స్థిరపడినప్పటికీ, స్వగ్రామంపై మమకారంతో ఎంతో మంది తన సంపాదనతో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. వీరిలో కొందరు వృద్ధులకు ఆసరాగా నిలుస్తున్నారు. ఇంకొందరు అనాథలను చేరదీస్తున్నారు. పేదలకు వైద్య సేవలు అందిస్తున్నారు. ఇలా వారికి తోచిన సహకారమందిస్తున్నారు. అభివృద్ధి పనులు, దేవాలయ నిర్మాణాలు చేపడుతున్నారు. సొంతూరిపై మమకారంతో ఉపకారం చేస్తున్న 'మాఊరి శ్రీమంతుల'పై ప్రత్యేక కథనం.
సొంతూరిపై మమకారం
నార్శింపల్లి: సొంతూరిపై మమకారంతో గ్రామాభివృద్ధి కోసం విద్యావంతులు విశేష సేవలందిస్తున్నారు. ఒకరు వృద్ధాశ్రమం ఏర్పాటు చేసి వృద్ధులకు సేవలు చేస్తే, మరొకరు ఉన్నత పాఠశాలను నిర్మించి విద్యాభివృద్ధికి పాటు పడుతున్నారు. గ్రామానికి చెందిన మత్తులూరు నరసింహప్ప విద్యావంతుడు. ఉన్నతోద్యోగం చేసి విరమణ పొందారు. సామాన్య కుటుంబంలో జన్మించిన నరసింహప్ప ఐఏఎస్ చదివి ఆదాయపు పన్ను కమిషనర్‌గా 2009లో పదవీ విరమణ చేశారు. ఈయన వృద్ధులకు సేవలు చేయాలనే తలంపుతో 1993లో రాష్ట్రీయ సేవా సమితి ఆధ్వర్యంలో వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేశారు. కన్నవారు ఉండి కూడా అనాథలైన వృద్ధులు, తన వారంటూ లేని 25 మంది వృద్ధులను పోషిస్తున్నారు.
సామాన్య కుటుంబంలో జన్మించిన జాస్తి వెంకట రాముడు ఐపీఎస్ చదివి ఉన్నతోద్యోగాలు పొందుతూ చివరకు రాష్ట్ర పోలీసు బాసుగా డీజీపీ పదవి చేపట్టారు. ఆయన కూడా గ్రామాభివృద్ధికి పాటు పడుతున్నారు. తన సొంత భూమి 20 ఎకరాల్లో జేవీఎం ఆర్డీటీ ఉన్నత పాఠశాలను నిర్మించి విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారు. నామ మాత్రపు ఫీజులతో ఎల్‌కేజీ నుంచీ పదోతరగతి వరకూ చదివిస్తున్నారు. రూ.10 లక్షలతో శ్మశాన వాటిక చుట్టూ ప్రహరీ నిర్మించారు. గ్రామంలో శ్రీరాముల దేవాలయం, కళాకారుల క్షేత్రం నిర్మించారు. గ్రామాభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామంటున్నారు.
పాంచజన్యుడి సేవలు
హిందూపురం: హిందూపురంలో పుట్టి పెరిగిన పాంచజన్య తన జీవితంలో కొంత భాగాన్ని సమాజ సేవకు కేటాయించారు. విద్యార్థి దశ నుంచి నాయకత్వ లక్షణాలు కలిగి లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్, వాసవీ క్లబ్ ద్వారా సొంతూరిలోనే సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పాంచజన్య బ్యానర్‌పై ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, సూపర్‌బజార్ లాంటి వ్యాపారాలను నిర్వహించారు. 2002లో ఎల్‌కేజీ నుంచి 10వ తరగతి వరకు పాంచజన్య బ్రిలియంట్స్ పాఠశాలను ప్రారంభించారు. దీంతోపాటు సత్యనారాయణశెట్టి, తాయారమ్మ ఎడ్యుకేషనల్ సొసైటీని నిర్మించి పేద విద్యార్థులకు సాల్కర్‌షిప్‌తోపాటు ఎంతో మందికి ఉచిత విద్యను అందిస్తున్నారు. పట్టణంలో చికున్‌గున్యా, డెంగీలాంటి వ్యాధుల బారిన పడిన వారికి మెడికల్ క్యాంపులు నిర్వహించి ఉచితంగా హోమియో మందులు పంపిణీ చేశారు. కర్నూలు, విశాఖలో సంభవించిన వరదల్లో బాధితులకు తన వంతు సాయం అందించారు.
భూదాత.. ఈ శివానంద
విడపనకల్లు: మండల పరిధిలోని పాల్తూరు గ్రామానికి చెందిన సామాన్య రైతు కుటుంబానికి చెందిన దిండిన రుద్రప్ప కుమారుడు దండిన శివానంద తన చాకచక్యంతో నేర్పుతో చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ అంచెలంచెలుగా ఎదిగారు. మొదట్లో కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో కాటన్ వ్యాపారం ప్రారంభించారు. క్రమంగా పలు రాష్ట్రాల్లో కాటన్ మిల్లులు స్థాపించారు. పుట్టిన ఊరికి కొంత సేవ చేయాలని అనుకుని, పాల్తూరు గ్రామ ప్రజలకు చేదోడు వాడోడుగా ఉంటూ ఆర్థిక సాయం చేస్తున్నారు. తన తల్లిదండ్రులు జ్ఞాపకార్థంగా దాదపు రు.20 లక్షల పెట్టి గౌరమ్మ దేవాలయం నిర్మించి తన భక్తిని చాటుకున్నారు. మరో రెండు దేవాలయాలకు మరమ్మతులు చేయించారు. గ్రామంలో హాస్పిటల్ నిర్మాణం కోసం కోట్లు విలువ చేసే రెండున్నర ఎకరాల స్థలాన్ని ఉచితంగా ఇచ్చారు.
మా ఊరికో దేవాలయం
బత్తలపల్లి : కన్నతల్లిలాంటి సొంతూరుకు ఎంత చేసినా తక్కువే అంటున్నాడు మండలంలోని అప్రాచ్చెరువుకు చెందిన తుంపిరి సాలప్ప. గ్రామానికి చెందిన తుంపిరి నరసింహులు కుమారుడు సాలప్ప రైల్వే ఇంజనీర్‌గా బెంగళూరులో స్థిరపడ్డారు. ప్రస్తుతం పదవీ విరమణ చేశారు. గ్రామాన్ని వదిలి 40 ఏళ్లు గడిచినా స్వగ్రామాన్ని మరువలేదు. బంధువుల కోరిక మేరకు రూ.5 లక్షలతో అప్రాచ్చెరువు ఎస్సీ కాలనీ(గుమ్మల్లకుంట ఎస్సీ కాలనీ)లో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని నిర్మించారు.