
కనుల పండువగా శ్రీనివాస కల్యాణం
హిందూపురం అర్బన్ : నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని శ్రీనివాసనగర్‌లోని గణపతి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం మూలవిరాట్ అభిషేకాలు నిర్వహించి విశేష అలంకరణతో పాటు ఆకుపూజ చేపట్టారు. అలాగే శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని వెంకటేశ్వర ఆలయంలో కనుల పండువగా శ్రీనివాస కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. శ్రీనివాస మాల« భక్తబృందం ఆధ్వర్యంలో మూలవిరాట్ వెంకటేశ్వరస్వామికి పంచామృతాభిషేకాలు నిర్వహించి విశేషంగా అలంకరించారు.
అనంతరం ఆలయంలో కల్యాణవేదికపై శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వరస్వామి ఉత్సవమూర్తులను కొలువుదీర్చి శాస్త్రోక్తంగా వందలాది మంది భక్తుల మధ్య కల్యాణోత్సవం నిర్వహించారు. తర్వాత భక్తులు తీర్థప్రసాదాలు, అన్నదానం చేపట్టారు. కాగా సోమవారం ఆలయంలో విశేష పూజలతో పాటు నారాయణ హోమం నిర్వహించనున్నట్టు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో శ్రీనివాసమందిరం విశ్వనాథ్, మధు, గురుస్వామి మధు, ఎల్‌ఐసీడీఓ రవీంద్రుడు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.