పాదయాత్రగా మల్లన్న చెంతకు..
ఆత్మకూరు: వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, ఆయన సతీమణి పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, వీరి కుమారుడు గౌరు జనార్దన్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ వైద్య విభాగం నేత ప్రహ్లాదరెడ్డితో పాటు 200 మందికి పైగా కార్యకర్తలు శ్రీశైలం క్షేత్రానికి బయలుదేరారు. శుక్రవారం నల్లమల అటవీ ప్రాంత పరిధిలోని బైర్లూటి చెంచుగూడెం నుంచి అటవీ మార్గంలో నాగలూటి క్షేత్రానికి చేరుకున్నారు. అక్కడ వెలసిన నాగలూటి వీరభద్రస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి కొంత సేపు సేద తీరారు. అనంతరం కాలినడక మెట్ల మార్గం వెంట పెచ్చెర్వుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ కొన్నేళ్లుగా తాము కాలినడకన శ్రీశైల క్షేత్రానికి వెళ్లి శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్లను దర్శించుకోవడం ఆనవాయితీ అని చెప్పారు. అటవీ మార్గంలో భక్తులకు మంచినీరు, మెడికల్ క్యాంప్‌లు ఇంకా ఏర్పాటు చేయకపోవడంపై విచారణ వ్యక్తం చేశారు. సత్వరమే శ్రీశైల దేవస్థానం అధికారులు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. గౌరు కుటుంబ సభ్యులతో పాటు వైసీపీ నాయకులు సత్యంరెడ్డి, రాజశేఖరరెడ్డి, రమణారెడ్డి, శివారెడ్డిలతో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, శివస్వాములు పాదయాత్రగా శ్రీశైలానికి బయలుదేరి వెళ్లారు.