అంగరంగ వైభవం.. శ్రీవారి కల్యాణం
రాయదుర్గం టౌన్ : విశిష్ట సంప్రదాయ పద్ధతిలో ప్రసన్న వేంకటరమణస్వామి కల్యాణోత్సవం పదకొండేళ్ల బాలికతో అంగరంగ వైభవంగా జరిగింది. ఏటా పద్మశాలీయ వంశం అరవ తెగకు చెందిన బాలికతో శ్రీవారికి పెళ్లి చేసే సంప్రదాయం రాయదుర్గంలో కొనసాగుతోంది. ఇలా చేయడం వల్ల సదరు బాలికకు సుగుణ సంపన్నుడైన భర్త లభిస్తాడని భక్తుల నమ్మకం. ఈ ఏడాది కూడా పద్మశాలీయ వంశస్తులైన రాయదుర్గంవాసి అరవ జనార్ధన, స్వప్న దంపతుల కుమార్తె అమూల్యతో శ్రీవారి వివాహం జరిపించారు. శనివారం ఉదయం స్వామివారి తరఫున పెళ్లి పెద్దలుగా బ్రాహ్మణులు, పుర ప్రముఖులు మేళతాళాలతో పెళ్లి కూతురు పద్మావతి (అమూల్య)ని ఊరేగింపుగా మార్కండేయస్వామి ఆలయానికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి పెళ్లికూతురిని అలంకరించి కోటలోని శ్రీవారి సన్నిధి వరకు ఊరేగింపుగా వచ్చారు.
అనంతరం పెళ్లి కూతురిని శ్రీవారి ఉత్సవ విగ్రహం పక్కన కూర్చోబెట్టారు. వేద మంత్రోచ్ఛరణల మధ్య పురోహితుల సమక్షంలో వివాహ కార్యక్రమాన్ని నిర్వహించారు. అభిజిత్ లగ్న శుభపుష్కరాంశమునందు పురోహితులు మంగళసూత్రాన్ని బాలిక మెడకు తాకించి శ్రీవారి పక్కనే ఉన్న పద్మావతి ఉత్సవ విగ్రహానికి కట్టారు. పసుపుకొమ్ముతో ఉన్న మంగళసూత్రాన్ని బాలిక మెడలో ఓ మహిళ కట్టడంతో పెళ్లితంతు ముగిసింది. కల్యాణోత్సవానికి ఆర్డీఓ కేఎస్ రామారావు, మున్సిపల్ మాజీ చైర్మన్లు గౌని ఉపేంద్రరెడ్డి, సోమా మల్లేశప్ప, ఆలయ పాలక మండలి చైర్మన్ తాయి శ్రీనివాసులు, ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసులు, కౌన్సిలర్లు పేర్మి బాలాజీ, బండి భారతి, ప్రశాంతి, ముదిగల్లు జ్యోతి, సంపత్‌కుమారి, నాగవేణి తదితరులు హాజరయ్యారు. అనంతరం భక్తులకు ప్రసాదం, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.