గిరిజన భవనం వెంటనే నిర్మించాలి
Published Mon, Jul 25 2016 5:50 PM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM
నంగారాభేరి లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రమావతు కృష్ణానాయక్
అరండల్‌పేట: నగరంలో గిరిజన భవనం వెంటనే నిర్మించాలని నంగారాభేరి లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రమావతు కృష్ణానాయక్ డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక బ్రాడీపేటలోని నంగారాభేరి లంబాడి హక్కుల పోరాట సమితి కార్యాలయంలో సమితి నాయకుల సమావేశం నిర్వహించారు. రమావతు కృష్ణానాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో తప్పనిసరిగా గిరిజన భవనాలు నిర్మించాలన్నారు. గుంటూరు జిల్లాకు సంబంధించిన గతంలోనే గిరిజన భవనం నిర్మాణానికి నిధులు విడుదలైనా ఇప్పటి వరకు భవన నిర్మాణం ప్రారంభించలేదన్నారు. దీనిపై సోమవారం లాడ్జిసెంటర్ అంబేడ్కర్ విగ్రహం నుంచి జెడ్పీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు చెప్పారు. అనంతరం జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండేను కలిసి వినతిపత్రం సమర్పిస్తామన్నారు. గిరిజనులకు ప్రభుత్వం అందించాల్సిన అన్ని సంక్షేమ కార్యక్రమాలను పూర్తిస్థాయిలో అమలయ్యేలా చూడాలన్నారు. జిల్లాలోని అన్ని గిరిజన సంఘాల నాయకులు కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. సమావేశంలో ఏకలవ్య సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె వెంకటేశ్వర్లు, బీజేపీ నాయకులు టైగర్ ప్రసాద్, గిరిజన సంఘాల నాయకులు ఎం.శివానాయక్, కె ఏసుబాబు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement