ఆదర్శంగా నిలపండి
– మోడల్ స్కూల్స్ ప్రిన్సిపాళ్లకు కలెక్టర్ పిలుపు
– పచ్చదనం అభివద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లావ్యాప్తంగా అన్ని మోడల్ స్కూళ్లను పేరుకు తగ్గట్టు అన్ని విషయాల్లో ఆదర్శంగా నిలపాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ప్రిన్సిపాళ్లకు పిలుపునిచ్చారు. మోడల్ స్కూల్స్ ప్రిన్సిపాళ్లతో ఆదివారం ఆయన కలెక్టరేట్ మీటింగ్ హాలులో సమావేశమయ్యారు. పాఠశాలల్లో అనేక సమస్యలు ఉన్నాయని చెబుతూ వాటి పరిష్కారానికి కషి చేస్తూనే అభివద్ధి చేసుకోవడంపై చొరవ చూపాలని సూచించారు. స్కూళ్లను ఆదర్శంగా నిలిపేందుకు అంకితభావంతో పనిచేయాలన్నారు. ప్రహరీలున్నా పాఠశాలల్లో పండ్ల మొక్కలు, కూరగాయల పెంపెకంతో పాటు పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. కాంపౌండ్‌వాల్ లేని పాఠశాలల్లో నాటిన మొక్కలకు ట్రీ గార్డులు ఏర్పాటు చేసి సంరక్షించాలన్నారు. గురుకుల పాఠశాలల తరహాలో ఆదర్శపాఠశాలల్లో పచ్చదనం అభివద్ధి చేయాలన్నారు. పాఠశాలల్లో అవసరమైన చోట గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తామని, స్పోర్ట్స్ పరికరాలు అందజేస్తామని తెలిపారు. అవసరమైన అభివద్ధి పనులకు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. దోమల నిర్మూలనపై 8,9,10 తరగతుల విద్యార్థులకు శిక్షణ ఇచ్చి తద్వారా ప్రజలకు అవగాహన కల్పించే చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో డీఈఓ రవీంద్రనాథరెడ్డి, ఈఈ ప్రతాప్‌రెడ్డి, డిప్యూటీ డీఈఓలు తదితరులు పాల్గొన్నారు.