ప్రారంభమైన శ్రీకృష్ణదేవరాయల ఉత్సవాలు
- పట్టణంలో భారీ ర్యాలీ, బహిరంగ సభ
- పలువురు నాయకులు, కవుల హాజరు
- ఉత్సవాలను ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్
పెనుకొండ : పట్టణంలో గురువారం శ్రీకృష్ణదేవరాయల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాయల ఉత్సవ కమిటీ నాయకులు స్థానిక శాంతినికేతన్, ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు, ప్రజలతో కలిసి డప్పు వాయిద్యాల నడుమ భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. స్థానిక వివేకానంద జూనియర్ కళాశాల వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. రాయల ఉత్సవాలను ప్రతియేటా ప్రభుత్వమే జిల్లా వ్యాప్తంగా నిర్వహించాలని వక్తలు డిమాండ్ చేశారు. డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యం మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు 15 సార్లు జిల్లాకు వచ్చి కపట ప్రేమ చూపారే కానీ రాయల ఉత్సవాల గురించి కనీసం ఆలోచించిన పాపాన పోలేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే పార్థసారథి సైతం ఉత్సవాలను పట్టించుకోలేదన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ మాట్లాడుతూ ప్రభుత్వం రాయల ఉత్సవాలు నిర్వహించకపోవడం సిగ్గుచేటన్నారు. పెనుకొండను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది హంపి తరహాలో అభివృద్ధి పరచాలని కోరారు. జిల్లా ప్రజలంతా శ్రీకృష్ణదేవరాయలకు రుణపడి ఉండాలన్నారు. కళాశాల అధినేత రవీంద్ర, కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కేటీ.శ్రీధర్, న్యాయవాది సుదర్శనరెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు గుట్టూరు చినవెంకటరాముడు, శాంతినికేతన్ స్కూల్ కరస్పాండెంట్ రమణారెడ్డి తదితరులు రాయల వైభవాన్ని, ఆయన పాలనాదక్షతను, మహామంత్రి తిమ్మరుసు చాణుక్నాన్ని, కట్టడాలు, సాంస్కృతిక వైభవాన్ని వివరించారు.
ఆకట్టుకున్న కవుల ప్రసంగం
కార్యక్రమంలో కవుల ప్రసంగం ఆహూతులను ఆకట్టుకుంది. కవి, కళాకారుడు కోనాపురం ఈశ్వరయ్య అధక్షతన నిర్వహించిన ప్రసంగంలో కొడిగెనహళ్లి రిటైర్డ్ ప్రిన్సిపల్ చారిత్రక పరిశోధకుడు కరణం సత్యనారాయణ, శ్రీనివాసులు, సాహిత్య పరిశోధకులు డాక్టర్ అంకే శ్రీనివాస్, కేంద్రసాహితీ అకాడమీ యువ పురస్కార గ్రహీత అప్పిరెడ్డి హరినాథరెడ్డి రాయల పాలనను వివరించారు. అప్పటి సాంస్కృతిక వైభవం, యుద్ధ నైపుణ్యాలు, వజ్రవ్యాపారాలు, అష్టదిగ్గజ కవుల ప్రావీణ్యం వంటి అనేక విషయాలను కళ్లకు కట్టినట్లు వివరించారు. మైనుద్దీన్ ఏకపాత్రాభినయం ఆకట్టుకుంది.