ప్చ్..!
Published Thu, Mar 16 2017 1:57 AM | Last Updated on Tue, Sep 5 2017 6:10 AM
గత ఎన్నికల్లో జిల్లాలో అత్యధికంగా 14 అసెంబ్లీ స్థానాలను టీడీపీకి కట్టబెట్టి అధికారం ఇచ్చిన జిల్లా ప్రజలను సర్కారు మరోమారు ఉసూరుమనిపించింది. నవ్యాంధ్ర కొత్త రాజధాని అమరావతిలో తొలిసారిగా ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌లో జిల్లాకు అన్యాయం చేసింది. కేవలం కంటితుడుపు కేటాయింపులతో సరిపెట్టింది. నామమాత్రంగా పెంచి అంకెల గారడీ చేసింది. గత హామీలకూ చోటివ్వలేదు. దీంతో ప్రభుత్వం తీరుపై అన్నివర్గాల ప్రజలూ పెదవి విరుస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, ఏలూరు : జిల్లాలోని సాగునీటి పథకాలకు అరకొర కేటాయింపులు చేసి సర్కారు చేతులు దులుపుకుంది. గతంతో పోలిస్తే నామమాత్రంగా నిధులు పెంచినా.. వాటితో పథకాలు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లా
అభివృద్ధిపై పెద్దగా ప్రకటనలు, కేటాయింపులు కూడా లేవు. పోలవరం ప్రాజెక్టుకు గత ఏడాది రూ.3,357 కోట్లుగా సవరించిన అంచనాలు ఉండగా.. ఈ ఏడాది వాటిని రూ.6,889 కోట్లకు పెంచింది. ఈ మొత్తం నాబార్డు రుణంగా కేటాయిస్తేగానీ ఖర్చు చేసే అవకాశం కనిపించడం లేదు. గత ఏడాది రూ.1700 కోట్లు మాత్రమే నాబార్డు రుణంగా వచ్చింది. ఈ ఏడాది రూ.6,889 కోట్లు రుణం వస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చింతలపూడి ఎత్తిపోతల పథకానికి ఈ ఏడాది రూ.160.76 కోట్లు ఖర్చు పెట్టగా వచ్చే ఏడాది బడ్జెట్‌లో రూ.91.90 కోట్లు కేటాయిం చారు. ఈ పథకానికి ఇంకా రూ.982 కోట్లు అవసరం. అదనంగా 2.8 లక్షల ఎకరాలకు నీరు అందించే రెండోదశ ప్రాజెక్టుకు ఇప్పటి వరకూ టెండర్లే పిలవలేదు. రెండోదశతో సుమారు రూ.4,909 కోట్ల అంచనాలు పెరిగితే ప్రభుత్వం మాత్రం రూ.91.90కోట్లు మాత్రం కేటాయించి చేతులు దులుపుకుంది. తాడిపూడి ఎత్తిపోతల పథకానికి రూ.554 కోట్లు అవసరం కాగా, ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.98.64 కోట్లు కేటాయించారు. గత ఏడాది రూ.55 కోట్లు కేటాయించి అందులో రూ. 46.80 కోట్లు ఖర్చుపెట్టారు. ఎర్రకాల్వ ఆధునికీకరణ కోసం ఇంకా రూ.64 కోట్లు అవసరం కాగా, గత ఏడాది రూ.2.6 కోట్లు కేటాయించి రూ.3.32 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ ఏడాది కేటాయింపులను రూ.18.80 కోట్లకు పెంచారు. ఇదే పద్ధతిలో సాగితే ఈ పథకాలు పూర్తవడానికి మరో మూడేళ్లు పడుతుంది. గోదావరి డెల్టా ఆధునికీకరణకు రూ.85.25 కోట్లు, గోదావరి పుష్కరపనులు, వరదల నియంత్రణకు రూ.89.86 కోట్లు, కృష్ణా,గోదావరి, పెన్నా డెల్టాలలో డ్రెయిన్ల నిర్వహణ కోసం రూ.45.21 కోట్లు కేటాయింపులు జరిగాయి. గోదావరి డెల్టా ఆధునీకరణ కోసం రూ.1,383 కోట్లు అవసరం కాగా ఇప్పటి వరకూ రూ.660 కోట్లు ఖర్చు పెట్టారు. గత ఏడాది బడ్జెట్‌లో రూ.15 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది ఉభయగోదావరి జిల్లాలకు కలిపి రూ.85.25 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ ఏడాది మన ఒక్క జిల్లాకే రూ.136 కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపిన సంగతి తెలిసిందే.
వీటి ప్రస్తావనేదీ!
గతంలో సీఎం చంద్రబాబునాయుడు తాడేపల్లిగూడెంలో బ్రిటిష్ కాలం నాటి విమానాశ్రయాన్ని పునరుద్ధరిస్తామని ప్రకటించినా బడ్జెట్‌లో దీని ప్రస్తావన లేదు. కొల్లేరు కాంటూరు కుదింపుపై గత అసెంబ్లీ సమావేశాల్లో మొక్కుబడి తీర్మానం చేసిన ప్రభుత్వం కొల్లేటిని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ప్రకటించింది. అయితే ఈ ఊసు బడ్జెట్‌లో లేదు. కాంటూరు కుదింపు ప్రక్రియ, అందుకు సంబంధించిన నిధుల గురించి కూడా ప్రస్తావించలేదు. గతంలో నిఫ్ట్ ఏలూరులోనూ ఏర్పాటయ్యే అవకాశముందని ప్రకటించినా దాని ఊసే మరిచారు. గతంలో జిల్లాలో సిరామిక్ పరిశ్రమను ఏర్పాటు చేస్తామని, చింతలపూడిలో బొగ్గు నిక్షేపాలను వెలికితీస్తామని, సాగు ప్రధాన జిల్లా కావడంతో నూనెశుద్ధి, కొబ్బరిపీచు పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని ప్రకటించినా.. అవన్నీ వట్టిమాటలుగా మిగిలిపోయాయి. నరసాపురం వద్ద మినీ ఫిషింగ్ హార్బర్ నెలకొల్పి, జల రవాణాను అభివృద్ధి చేయనున్నట్టు గతంలో ప్రకటించినా.. బడ్జెట్‌లో ప్రస్తావించలేదు. ఆక్వా వర్సిటీ ఏర్పాటు ఊసు కూడా బడ్జెట్‌లో కానరాలేదు. ఏలూరు నగరాన్ని స్మార్ట్ సిటీగా ప్రకటించినా రూ.15 కోట్లు కూడా దక్కలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13 స్మార్ట్ సిటీలకు కలిపి రూ.150 కోట్లు కేటాయించారు.
కొత్త ఊరింపు
గత హామీల ప్రస్తావన లేకపోయినా కొత్తగా కొన్ని ఊరింపు ప్రకటనలను బడ్జెట్‌లో వల్లెవేశారు. జిల్లాలో మొక్కజొన్న పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలుపుతున్నట్టు ప్రకటించారు. ఆయిల్‌పామ్ సాగు ప్రోత్సాహకానికి రూ. 55 కోట్లు ప్రకటించారు. తాడేపల్లిగూడెంలో భారత ప్రభుత్వ సహకారంతో ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.
అప్రాధాన్యమే !
అధికారం చేపట్టాక 40సార్లు జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గత ఎన్నికల్లో అధికారం కట్టబెట్టడంలో కీలకపాత్ర పోషించిన జిల్లా రుణం తీర్చుకోలేనని, జిల్లా అభివృద్ధికి పెద్దపీట వేస్తానని ప్రకటనలు గుప్పించారు. అయితే ఈ హామీ బడ్జెట్‌లో ఎక్కడా ప్రతిఫలించలేదు. పొరుగు జిల్లాలకు దక్కిన ప్రాధాన్యంలో సగం కాదు కదా.. కనీస మాత్రంగా కూడా జిల్లాకు దక్కలేదు.
Advertisement
Advertisement