సమైక్య రాష్ట్రం కోసం పల్లె జనం నగరాలు
Published Fri, Aug 9 2013 2:28 AM | Last Updated on Fri, Sep 1 2017 9:44 PM
సమైక్య రాష్ట్రం కోసం పల్లె జనం నగరాలు, పట్టణాలకు కదలివచ్చి ఉద్యమంలో పాల్గొన్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ జిల్లాలో పెద్ద ఎత్తున తొమ్మిది రోజులుగా ఉద్యమాలు కొనసాగుతున్నాయి. పల్లెల్లోనూ నిరసనలు తెలియజేస్తున్నారు. నగరాలు, పట్టణాల్లో వినూత్న రీతిలో జరుగుతున్న నిరసనల్లో పాల్గొనేందుకు సమైక్యవాదులు గురువారం పెద్ద ఎత్తున తరలివచ్చారు. తిరుపతి డివిజన్ పరిధిలోని వివిధ గ్రామాల నుంచి పొదుపు సంఘాల మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి ఆందోళనలో భాగం పంచుకున్నారు. బాలాజీ కాలనీ నుంచి తెలుగుతల్లి విగ్రహం వరకు ర్యాలీ నిర్వహిం చారు. జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేస్తూ ముందుకు కదిలారు.
సాక్షి, తిరుపతి : రాష్ట్ర విభజన జరిగితే రాయలసీమకు, ముఖ్యంగా తిరుపతికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మె ల్యే భూమన కరుణాకర రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం తిరుపతిలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ఆయన మాట్లాడుతూ తిరుపతికి వచ్చే కృష్ణా జలాలు తెలంగాణ నుంచే రావాల్సి ఉందని, ఆ నీళ్లను ఆపేస్తారని పేర్కొన్నారు. శ్రీశైలం డ్యాంకు నీళ్లు అందకపోతే, తెలుగుగంగ నీరు సరఫరా కాదని చెప్పారు. ఇప్పుడు తిరుపతి ప్రజలకు అందుతున్న 30 లీటర్ల నీళ్లు కూడా లభించవని తెలిపారు. దీంతో పాటు రాయలసీమలోని ఏ ప్రాజెక్టుకు నీళ్లు అందవని చెప్పారు.
చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి అయాచితంగా ముఖ్యమంత్రి పదవి పొంది, ప్రతిరోజు సంపాదన కోసం అర్రులు చాస్తున్నారు కానీ, రాయలసీమ ప్రయోజనాల గురించి ఆలోచించడం లేదని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన జరుగుతుందని తెలిసిన వెంటనే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలు తోబుట్టువులేనని, అయితే అక్కడ ఉద్యమం చేస్తున్న దొరలు సీమాంధ్రపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. సీమాంధ్ర ప్రజల ఒత్తిడిని తట్టుకోలేక టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు చేస్తున్న దొంగ రాజీనామాలను ప్రజలు నమ్మడం లేదని పేర్కొన్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకించి, తిరుపతి ప్రజలు ఎండ, వానలు లెక్క చేయకుండా పోరాటం చేస్తున్నారని అభినందించారు.
అనంతరం వైఎస్సార్‌సీపీ నగర కన్వీనరు పాలగిరి ప్రతాపరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, చిత్తూరు జిల్లాలో పుట్టినా, హైదరాబాద్‌లో ఓటు హక్కు ను రాసుకున్నారని తెలిపారు. ఎమ్మెల్యే కరుణాకరరెడ్డికి అండగా ఉంటూ, ఆయన చేస్తున్న పోరాటానికి సహకరించాలని పిలుపునిచ్చారు. మద్య నిషేధం కోసం భూమన అభినయ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ నెల 14 తీర్పు వస్తుందని, తీర్పు అనుకూలంగా వస్తే తిరుపతిలో మద్యం నిషేధం విధిస్తారని పేర్కొన్నారు. తాము సమైక్యాంధ్రకు మద్దతు ఇస్తున్నామంటూనే కొందరు నాయకులు రాజీనామాలు చేయకుండా దొంగనాటకాలు ఆడుతున్నారని పార్టీ నాయకులు ఎస్‌కె.బాబు విమర్శించారు.
రాష్ట్రాన్ని విభజించడానికి, రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించడానికి దిగ్విజయ్ సింగ్ ఎవరని పార్టీ మైనారిటీ విభాగం కన్వీనరు షఫీ అహ్మద్ ఖాద్రీ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ పదవులను కాపాడుకునేందుకు రాష్ట్రాన్ని పణంగా పెడుతున్నారని పార్టీ స్టీరింగ్ కమిటీ సభ్యుడు ఎంవిఎస్.మణి పేర్కొన్నారు. కార్యక్రమంలో మహిళా కన్వీనర్ కుసుమ, ఎస్సీ సెల్ కన్వీనర్ రాజేంద్ర తదితరులు ప్రసంగించారు. జెడ్పీటీసీ మాజీ సభ్యుడు వెంకటముని, తిరుమలయ్య, కేతం రామరావు, బాలమునిరెడ్డి, మల్లం రవి, మాధవనాయుడు, చెంచయ్యయాదవ్, తొండమనాటి వెంకటేష్, ముద్ర నారాయణ, దొడ్డారెడ్డి సిద్దారెడ్డి, శాంతారెడ్డి, పునీత, తాళ్లూరు ప్రసాద్, గౌరి, రంగా యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement