సంబరాలకు సర్వం సిద్ధం
♦ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఏర్పాట్లు
♦ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్న అమరవీరుల స్థూపం
♦ వేడుకల్లో పాల్గొననున్న మంత్రి లక్ష్మారెడ్డి
♦ రెండో రోజు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కేసీఆర్ కిట్..
♦ మూడో రోజు ఒంటరి మహిళలకు పింఛన్ల అందజేత
సాక్షి, మహబూబ్‌నగర్: రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మూడు రోజుల పాటు సంబరాలు అంబరాన్నంటనున్నాయి. గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు అన్ని ప్రభుత్వ కార్యలయాల్లో పెద్దఎత్తున వేడుకలను నిర్వంచనున్నారు. జూన్ 2న ప్రారంభమయ్యే ఆవిర్భావ వేడుకలకు ముఖ్య అథితిగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి హాజరు కానున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్‌అండ్‌బీ అథితి గృహ ఆవరణలో ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపాన్ని ఆవిష్కరించనున్నారు. జిల్లా కేంద్రం నడిబొడ్డున ఏర్పాటు చేసిన ఈ స్థూపం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. దాదాపు 800 గజాల స్థలంలో 38 అడుగుల ఎత్తుతో కూడిన ఈ స్థూపానికి తుది మెరుగులు దిద్దుతున్నారు.
అందుకోసం 8 మంది కళాకారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. స్థూపం చుట్టూ పచ్చదనం ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అదే విధంగా ఆవిర్భావ సంబరాలు జరిగే మూడు రోజులపాటు అన్ని ప్రభుత్వ కార్యలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించనున్నారు. అదే విధంగా పట్టణ ప్రధాన కూడళ్లలో కూడా విద్యుత్ దీపాలతో ప్రత్యేక ఆకర్షణలు ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఆవిర్భావ వేడుకల ప్రారంభం రోజు జూన్2న పోలీస్ పరేడ్ మైదానంలో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పోలీసులు పరేడ్ నిర్వహించనున్నారు. వివిధ శాఖలకు సంబంధించిన స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. సాయంత్రం వివిధ కళారూపాలతో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించేలా కళారూప ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్టతలు ప్రదర్శించిన వారిని సత్కరించనున్నారు.
రెండవ రోజు కేసీఆర్ కిట్ పంపిణీ..
ఆవిర్భావ వేడుకల్లో భాగమైన రెండో రోజు జూన్ 3న... ప్రతిష్టాత్మకమైన కేసీఆర్ కిట్ పంపిణీ చేయనున్నారు. జిల్లా ఆస్పత్రితోపాటు ఏరియా, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, పీహెచ్‌సీలలో కేసీఆర్ కిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. వీటి పంపిణీలో ప్రజాప్రతినిధులు, అధికారులను భాగస్వామ్యం చేసేలా ఏర్పాటు చేస్తున్నారు. కేసీఆర్ కిట్ల పంపిణీ విషయంలో ఇప్పటికే లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేశారు. కిట్ల పంపిణీలో ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలను భాగస్వామ్యం చేశారు. వీటి పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.
6154మంది ఒంటరి మహిళలకు పింఛన్లు..
ఆవిర్భావ వేడుకల్లో భాగంగా మూడో రోజు జూన్ 4 తేదీన ఒంటరి మహిళలకు పింఛన్లు అందజేయనున్నారు. జిల్లా కేంద్రంతో పాటు ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో సదరు ఎమ్మెల్యేల చేత పంపిణీ చేయనున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 6154 మంది ఒంటరి మహిళలు అర్హులుగా అధికారులు గుర్తించారు. వీరందరికి జూన్ 4న ప్రభుత్వం నిర్దేశించిన రూ.వెయ్యి చొప్పున పింఛన్లు అందజేయనున్నారు. జిల్లాలోని ఒంటరి మహిళల పింఛన్ల కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.61.54లక్షలను విడుదల చేసింది.