ఎందుకింత దాపరికం?
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ జిల్లా కడప శివారులోని నారాయణ కళాశాలలో ఇద్దరు ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థినుల మృతి పలు అనుమానాలకు తావిస్తోంది. ఘటన చోటుచేసుకున్నప్పటి నుంచి యాజమాన్యం తీరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విషయాన్ని వెంటనే తల్లిదండ్రులకు చెప్పకపోవడం, మృతుల బంధువులను దగ్గరకు రానివ్వకపోవడం, డీఎస్పీ స్థాయి అధికారులతో కానిస్టేబుల్ డ్యూటీ చేయిస్తుండటం, మృతదేహాలను త్వరగా తీసుకెళ్లాలని తొందరపెట్టడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది.
తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడిన మనీషా
ప్రతిరోజూ మధ్యాహ్న భోజనం సమయంలో తన తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడే మనీషా... సోమవారం మధ్యాహ్నం 1.30 గంటలకు క్యాంపస్‌లోని కాయిన్ బాక్సు నుంచి ఫోన్ చేసి తనతో మాట్లాడిందని తల్లి సరోజ తెలిపారు. తాను మాట్లాడేప్పుడు ఎలాంటి ఆవేదన, ఆందోళన వ్యక్తంచేయలేదని, అలాంటిది సాయంత్రంలోపే ఎందుకు ఆత్మహత్య చేసుకుంటుందని ఆమె ప్రశ్నిస్తున్నారు. ఈ నెల మొదటి వారంలో నిర్వహించిన పరీక్షల్లో 270 మార్కులకుగాను 190 వచ్చాయని, ఎలా చూసినా మనీషా ఆత్మహత్య చేసుకునే ప్రసక్తేలేదని కుటుంబీకులు వాదిస్తున్నారు.
తీవ్రమైన వేధింపులు..
నందినికి మార్కులు తక్కువగా వస్తున్నాయంటూ కళాశాల సిబ్బంది తీవ్రంగా వేధించినట్లు తెలుస్తోంది. దీంతోపాటు ఆగస్టు 15 రాత్రి అదే కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న నందిని సోదరి పావని(పెద్దమ్మ కుమార్తె) గదిలో మనీషా, నందిని నిద్రపోయారు. ఈ విషయమై కళాశాల సిబ్బంది వారిని తీవ్రంగా దూషించినట్లు సమాచారం. వారు ఎదు రు చెప్పిఉంటే సిబ్బంది కొట్టి ఉంటారని, దీనివల్ల చనిపోవడంతో ఆత్మహత్య డ్రామా సృష్టించారనే ఆరోపణలూ వ్యక్తమవుతున్నాయి.
దర్యాప్తులో పారదర్శకత ఏదీ
విద్యార్థినుల మృ తిపై పారదర్శకంగా దర్యాప్తు చేస్తున్నామని డీఐజీ రమణకుమార్ ఒకపక్క చెబుతున్నా... రెండు రోజు లుగా అందుకు భిన్నమైన పరిస్థితులున్నాయని విద్యార్థినుల బంధువులు ఆరోపిస్తున్నారు. మృతి విషయాన్ని యాజమాన్యం గోప్యంగా ఉంచడం, ఘటన జరిగాక అదే క్యాంపస్‌లో ఉన్న నందిని సోదరి పావనిని అక్కడికి అనుమతించకపోవడం, తల్లిదండ్రులకు సమాచారం ఇస్తానని చెప్పినా నిరాకరించడం, పక్క క్యాంపస్‌లో ఉన్న మనీషా సోదరుడు సాయికృష్ణారెడ్డిని లోపలకు అనుమతించకపోవడంలో ఆంతర్యమేంటని ప్రశ్నిస్తున్నారు.
మృతదేహాల్ని మార్చురీ నుంచి శరవేగంగా తీసుకెళ్లాలని పోలీసులు ఎందుకు ఒత్తిడి చేశారని నిలదీస్తున్నా రు. నారాయణ విద్యాసంస్థల వద్ద ఏఆర్ కానిస్టేబుళ్లు బందోబస్తు నిర్వహిస్తే సరిపోయేదానికి ఒక్కో క్యాంపస్ వద్ద డీఎస్పీ, సీఐ, ఇద్దరు ఎసై్సలు, సుమారు 50 మంది కానిస్టేబుళ్లు ఉండటం వెనుక మర్మమేంటని విశ్లేషకులు ఆశ్చర్యపోతున్నారు. బుధవారం కడప బంద్‌కు పిలుపునిస్తే.. మంగళవారం అర్ధరాత్రే నేతలను అరెస్ట్ చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే దర్యాప్తు పారదర్శకంగా సాగుతుందన్న నమ్మకం లేదంటున్నారు.
విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి..
నారాయణ కళాశాలలో తమపై తీవ్రంగా ఒత్తిడి ఉన్నట్లు విద్యార్థులు వివరిస్తున్నారు. పరీక్షలపేరిట తల్లిదండ్రుల్ని అనుమతించట్లేదన్నారు. తక్కువ మార్కులొచ్చిన విద్యార్థులు ఆత్మసై్థర్యం కోల్పోయేలా యాజమాన్యం ప్రవర్తిస్తోందని పలువురు కన్నీటిపర్యంతమయ్యా రు. ఈ బాధలు పడలేక ఎందరో విద్యార్థులు పారిపోయిన ఉదంతాలున్నట్లు చెబుతున్నారు.