చాయ్ బిస్కెట్ లాగించేయ్.. చర్చకు చెక్ పెట్టేయ్!!
రెండేళ్ల టీడీపీ పాలనలో జిల్లా పరిషత్ పాలకవర్గం ఉదాసీనంగా ఉంటోంది. ప్రతి మూడు నెలలకోసారి నిర్వహించే సర్వసభ్య సమావేశాల ఖర్చులు తడిసి మోపడవుతున్నా... అభివృద్ధిపై చర్చ నామమాత్రంగానే ఉంటోంది. ఇప్పటి వరకూ జరిగిన అన్ని సమావేశాల్లోనూ హాజరయ్యే ప్రజాప్రతినిధులు అక్కడ ఇచ్చే చాయ్ బిస్కెట్లతో తృప్తి చెందుతూ తమతమ ప్రాంతాల అభివృద్ధిని అటకెక్కించేస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం మరోసారి జిల్లా పరిషత్ స్థాయీ సంఘాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
- అనంతపురం సిటీ
ప్రతి సమావేశం వాయిదా!
ఇప్పటి వరకూ నిర్వహించిన స్థాయీ సంఘాల సమావేశాలు వాయిదా పడుతూ వచ్చాయి. వాటిని మరోసారి నిర్వహించడంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తూ వచ్చారు. సమావేశాల్లో ప్రతిపాదనలకు చేసిన ఏ ఒక్క తీర్మానం పరిష్కారమైంది... లేనిది నేటికీ అర్థం కాని అయోమయ పరిస్థితి ఉంది. దీనికి తోడు అభివృద్ధి పనులకు సంబంధించి నిధులు తీసుకురావడంలో పాలక వర్గం పూర్తిగా వైఫల్యమైనట్లు ఆరోపణలున్నాయి.
సమన్వయ లోపం
ప్రజాప్రతినిధులు, అధికారుల మధ్య విభేదాలూ తీవ్రస్థాయిలో ఉండడంతో జిల్లా అభివృద్ధి కుంటు పడుతున్నట్లు సమాచారం. ఇదే విషయంపై పలువురు జెడ్పీటీసీ సభ్యులు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమావేశాలు నిర్వహించిన ప్రతిసారీ సమస్యలపై చర్చలేవనెత్తేందుకు ప్రయత్నిస్తే.. పాలకవర్గం అవకాశమివ్వకపోవడంతో అసహనానికి గురైన కొందరు సభ నుంచి వైదొలగేందుకు చూశారు. ఆ సమయంలో నేతల బుజ్జగింపులతో దిగివచ్చి... సమావేశం నిర్వహణకు సహకరించిన సందర్భాలూ లేకపోలేదు. సమస్యలతో తలమునకలు అవుతున్న ప్రజలకు కనీసం ఈ సమావేశంలోనైనా అధికార పార్టీ నేతలు ఊరట కలిగిస్తారో లేదా.. గత సమావేశాల్లాగానే చాయ్ బిస్కట్‌లకు పరిమితం చేస్తారో వేచి చూడాలి.