: మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి మందడపు వెంకటేశ్వరరావు
-
రాష్ట్ర కార్యదర్శి మందడపు వెంకటేశ్వరావు
ఖమ్మం మామిళ్లగూడెం : వైఎస్సార్‌సీపీని బలోపేతం చేయాలని రాష్ట్ర కార్యదర్శి మందడపు వెంకటేశ్వరరావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఖమ్మం నగర కమిటీతోపాటు డివిజన్ కమిటీలు ఏర్పాటు చేశారు. నగర అధ్యక్షుడిగా తుమ్మ అప్పిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా జమలాపురం రామకృష్ణ, యువజన సంఘం అధ్యక్షుడిగా ఆదూరి రాజవర్దన్‌రెడ్డిని నియమించారు. ఈ సందర్భంగా శుక్రవారం ముస్తఫానగర్‌లో జరిగిన సమావేశంలో మందడపు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నగరంతోపాటు డివిజన్ అధ్యక్షుల ప్రతిపాదనలు కూడా జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, రాష్ట్ర కమిటీకి పంపామని, అందులోభాగంగా కొన్ని మండల కమిటీల ప్రతిపానలు కూడా పంపామని తెలిపారు. ఈ కమిటీలు క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషిచేయడంతోపాటు, పాలకుల ప్రజావ్యతిరేక విధానాలను వ్యతిరేకించాలని సూచించారు. మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమలయ్యేవిధంగా చూడాలన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు దళితులకు 3 ఎకరాల భూమి పంపిణీ, కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య, ఇంటింటికీ నల్లా కనెక్షన్, డబుల్ బెడ్రూం లాంటివి ఒక్కటి కూడా అమలయ్యే పరిస్థితి లేదని విమర్శించారు. ఈ సందర్భంగా నగర అధ్యక్షుడు తుమ్మా అప్పిరెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించడంపై పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, రాష్ట్ర కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాన కార్యదర్శి జమలాపురం రామకృష్ణ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శులు మందడపు వెంకట్రామిరెడ్డి, ఆలస్యం సుధాకర్, నగర నాయకులు కొవ్వూరి శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణ, భువనగిరి వెంకటరమణ పాల్గొన్నారు.