రెయిన్‌గన్‌ను పరిశీలిస్తున్న మంత్రి మృణాళిని
పంటను కాపాడేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు
Published Sat, Sep 3 2016 12:29 AM | Last Updated on Mon, Sep 4 2017 12:01 PM
– రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రి మృణాళిని
– ముందే మేల్కొని ఉంటే బాగుండేదన్న వ్యవసాయాధికారులు
మదనపల్లె రూరల్:
వర్షాభావంతో ఎండిపోతున్న వేరుశనగ పంటను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రి కిమిడి మృణాళిని తెలిపారు. శుక్రవారం సీటీఎం పంచాయతీ మిట్టపల్లెలో రెయిన్ గన్స్ ద్వారా వేరుశెనగ పంటకు అందిస్తున్న నీటి తడులను ఇచ్చే కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. పంట పరిస్థితిపై వ్యవసాయ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. జూలైలో వేసిన పంటకు ప్రస్తుతం ఎలాంటి డోకా లేదని, జూన్ నెల మొదటి వారంలో వేసిన పంటతోనే ఇబ్బందని అధికారులు మంత్రికి వివరించారు. సుమారు 50శాతం వరకు పంట నష్టం రావచ్చని తెలియజేశారు. పంటను కాపాడేందుకు చర్యలు తీసుకోవడంలో ఇప్పటికే చాలా ఆలస్యం జరిగిందన్నారు. పదిహేనురోజుల క్రితం తడులు అందించి ఉంటే నష్టం పెద్దగా ఉండేది కాదంటూ వివరించారు. అనంతరం తిరుపతి వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం పంట పరిస్థితిపై విచారించారు. ప్రస్తుతం అందిస్తున్న తడులతో మొక్క, పైనున్న భూమి తడుస్తోందే తప్ప నీరు భూమిలోకి ఇంకి లోపలకు వెళ్లడం లేదని వివరించారు. ఎకరాకు 20 వేల లీటర్ల నీరు కాకుండా 30 వేల లీటర్లు అందిస్తే ప్రయోజనముంటుందన్నారు. మంత్రి కిమిడి మణాళిని మాట్లాడుతూ వేరుశనగ పంటను కాపాడేందుకు ముఖ్యమంత్రి వారంరోజులుగా రాయలసీమలో యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అధికారుల సమన్వయంతో విపత్తును ఎదుర్కొనేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారన్నారు. ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలతో ఎలాంటి ఫలితాలు వస్తాయనే అంశాలను అనుభవంగా చేసుకుని రాబోయే రోజుల్లో విపత్కర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొంటామన్నారు. కార్యక్రమంలో సబ్‌కలెక్టర్ కృతికాభాత్రా, ఎమ్మెల్సీ నరేష్‌కుమార్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ శివప్రసాద్, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటిరమేష్, డీఆర్‌డీఏ పీడీ రవిప్రకాష్‌రెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement