నిప్పంటించుకుని విద్యార్థిని ఆత్మహత్య
కావలిరూరల్ : చదువుకోమని తల్లి మందలిండంతో క్షణికావేశంలో కిరోసిన్ పోసుకుని విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం జరిగింది. మండలంలోని కొత్తసత్రం గ్రామానికి చెందిన పామంజి మంగమ్మ, శ్రీనివాసులు దంపతులు పట్టణంలోని పాతవూరు గట్టుపల్లివారివీధిలో నివాసం ఉంటున్నారు. వీరి చిన్న కుమార్తె భువనేశ్వరి (16) స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. చదువు మీద ఆసక్తిలేని భువనేశ్వరి తరచూ కళాశాలకు సెలవులు పెడుతుంది. ఇటీవల చదువుకోమని తల్లి ఒత్తిడి చేయడంతో అలిగి కొత్తసత్రంలో ఉన్న అక్క దగ్గరకు వెళ్లింది. అక్కడి నుంచి బుధవారం తిరిగి ఇంటికి వచ్చింది. గురువారం ఉదయం భువనేశ్వరిని తల్లి కాలేజీకి వెళ్లమని మందలించడంతో ఇంట్లో ఎవరూలేని సమయం చూసుకుని ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. గమనించిన స్థానికులు 108కు సమాచారమందించారు. గాయపడిన భువనేశ్వరిని కావలి ఏరియా వైద్యశాలకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఒకటో పట్టణ ఎస్‌ఐ జి.అంకమ్మ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.