
చెరువులోకి పడి విద్యార్థి మృతి
రొళ్ల: చెరువులోకి జారిపడి శివన్న (13) అనే విద్యార్థి మృతి చెందిన ఘటన రొళ్ల మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే.. గురువారం సాయంత్రం ఎంఆర్ గొల్లహట్టిలోని బడిగి క్రిష్టప్ప, గిరిజమ్మ దంపతుల రెండో సంతానమైన శివన్న ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. సాయంత్రం 4.30 గంటల సమయంలో పాఠశాల ముగించుకుని ఇంటికి చేరుకున్నాడు. అనంతరం తోటి విద్యార్థులతో కలిసి చెరువు కట్టపైకి వెళ్లాడు. అయితే చెరువు గుంతలోకి ప్రమాదశాత్తు జారిపడటంతో శివన్నకు ఈతరాని కారణంగా నీటిలో మునిగిపోయాడు.
తోటి విద్యార్థులు భయంతో ఇంటికి పరుగులు తీసి సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకుని చూసేసరికి శివన్న విగతజీవిగా మారిపోయాడు. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు, బంధుమిత్రలు కన్నీరుమున్నీరుగా విలపించారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ లక్ష్మీనాయక్, జమేదార్‌బషీర్ అక్కడికి చేరుకుని ఘటనపై ఆరాతీశారు. వీఆర్‌ఓ శేఖర్‌కుమార్ ఎదుట పంచనామ నిర్వహించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.