
ఆకతాయిల వేధింపులు తాళలేక యువతి...
సూర్యాపేట(నల్లగొండ): ఆకతాయిల వేధింపులు తాళలేక ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. ఇది గుర్తించిన ఇరుగు పొరుగు వారు ఆమెను రక్షించడంతో తృటిలో ప్రాణాపాయం తప్పిపోయింది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా సూర్యాపేటలోని చంద్రన్నకుంటలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న యువతి(20) ఇంటర్ మీడియట్ వరకు చదువుకుంది. ప్రస్తుతం ఇంటి వద్దే ఖాళీగా ఉంటోంది. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా అదే ప్రాంతానికి చెందిన కొందరు ఆకతాయిలు ఆమెను వేధిస్తున్నారు.
ఈ మధ్యకాలంలో వేధింపులు మరీ ఎక్కువవడంతో.. ఈ రోజు వంటిపై కిరొసిన్ పోసుకొని నిప్పంటించుకోవడానికి యత్నించింది. ఇది గుర్తించిన చుట్టుపక్కల ఇళ్ల వారు ఆమెను రక్షించి ఆస్పత్రికి తరలించారు. పొలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఘటనకు కారకులైన ముగ్గురు ఆకతాయిలను అదుపులోకి తీసుకున్నారు.