పీయూలో విద్యార్థుల ఘర్షణ | students protest in palamuru univrsity | Sakshi
Sakshi News home page

పీయూలో విద్యార్థుల ఘర్షణ

Published Sun, Apr 3 2016 2:58 AM | Last Updated on Sun, Sep 3 2017 9:05 PM

పీయూలో విద్యార్థుల ఘర్షణ

పీయూలో విద్యార్థుల ఘర్షణ

బీఎస్‌ఎఫ్, ఏబీవీపీ నేతల బాహాబాహీ
కేర్‌టేకర్‌ను తొలగించే విషయంపై రచ్చ రచ్చ
ఇద్దరు విద్యార్థులకు గాయాలు

పాలమూరు యూనివర్సిటీ: మహబూబ్‌నగర్ జిల్లా పీయూ (పాలమూరు యూనివర్సిటీ)లో శనివారం విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. విద్యార్థినేతలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకోవడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బాధిత విద్యార్థుల కథనం మేరకు.. ప్రస్తుతం పీయూ పీజీ కళాశాల హాస్టల్ వార్డెన్‌గా ఉన్న పర్వతాలు సక్రమంగా పనిచేయడం లేదని.. అతడిని తొలగించాలని శని వారం మధ్యాహ్నం పీయూ ప్రిన్సిపాల్ పవన్‌కుమార్‌ను పీజీ ప్రథమ సంవత్సరం విద్యార్థులు కలిసి ఫిర్యాదు చేశారు. అయితే సాయంత్రం 4 గంటల ప్రాంతంలో అక్కడికి చేరుకుని ఏబీవీపీ పీయూ ఇన్‌చార్జ్ రాజు నాయక్..హాస్టల్ వార్డెన్‌పై ఎందుకు ఫిర్యాదుచేశారని అక్కడే ఉన్న పీజీ ప్రథమ సంవత్సరం విద్యార్థులను ప్రశ్నించారు. అక్కడే ఉన్న బహుజన స్టూడెంట్ ఫ్రంట్(బీఎస్‌ఎఫ్) జిల్లా అధ్యక్షుడు, ఫార్మాసీ విద్యార్థి బండి పృథ్వీరాజ్ వారించాడు.

రాజు నాయక్ కల్పించుకుని యూనివర్సిటీల్లో కులరాజకీయాలు చేస్తున్నారని అతడిపై దూషణలకు దిగాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.  ఇదే సమయంలో శ్రీనివాసులు ఆంగ్లం ప్రథమ సంవత్సరం విద్యార్థి భవనంపై నుంచి కిందకు నీళ్లు తాగడానికి వస్తే అతడిని కూడా రాజునాయక్ ఎందుకు ఫిర్యాదు చేశారని అడిగాడు. ఈ క్రమంలో రాజు నాయక్ శ్రీనివాస్ అనే విద్యార్థిపై రాయితో దాడి చేయడం తో తీవ్రంగా గాయపడ్డాడు. ఇదే సమయంలో పృథ్వీరాజ్‌పై దాడిచేసి మర్మాంగాలపై కాళ్లతో తన్నడంతో సృహ కోల్పోయాడు. విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకున్నారు.

దీంతో గాయపడిన శ్రీనివాసులు, పృథ్వీరాజ్‌ను పోలీ సులు ఆస్పత్రికి తరలించారు. దాడికి పాల్పడిన రాజునాయక్‌ను మహబూబ్‌నగర్ రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పీయూలో విద్యార్థులపై దాడి చేసిన ఏబీవీపీ నాయకులను అరెస్టు చేసిన కఠిన చర్యలు తీసుకోవాలని పీయూ విద్యార్థులు పీయూ ఎదుట ధర్నాచేశారు. సంఘటన స్థలానికి రూరల్ సీఐ రామకృష్ణ, ఎస్‌ఐ రాజేశ్వర్‌గౌడ్ చేరుకుని విచారణ చేపట్టారు. ఈ సంఘటనపై ఒకరిపై ఒకరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement