ఎస్వీయూ యశస్సు
• దూసుకెళుతున్న ఎస్వీ యూనివర్సిటీ
• తాజా ర్యాంకింగులతో మరో కీర్తి కిరీటం
• ఇప్పటికే పలు పురస్కారాలు సొంతం
• పరిశోధనల్లోనూ ఉన్నత సోపానాలు
శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ జాతీయ స్థాయిలో ఖ్యాతి సంపాదిస్తోంది. అంచెలంచెలుగా ఎదుగుతూ రాయలసీమకు గర్వకారణంగా నిలుస్తోంది. వెనుకబడిన ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్య అందించాలనే లక్ష్యంతో 1954 సెప్టెంబర్ 2న ఏర్పాటైన ఎస్వీయూ అభివృద్ధి
పథంలో దూసుకెళుతోంది. తాజాగా జాతీయ,అంతర్జాతీయ సంస్థల ర్యాంకింగ్‌ల్లో మెరుగైన స్థానాలు పొంది రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి కృషి ఫలితంగా ఏర్పాటైన ఈ వర్సిటీ 63 వసంతాలు పూర్తి చేసుకుంది.
యూనివర్సిటీక్యాంపస్: తిరుపతిలోని ఎస్వీయూనివర్సిటీ జాతీయ స్థాయిలో అందరి దృష్టినీ ఆకట్టుకుంది. తెలుగు వర్సిటీలో అగ్రగామిగా నిలిచి సమున్నత స్థానాన్ని సాధించింది. 1954లో 1000 ఎకరాల స్థలంలో ఈ వర్సిటీ ఏర్పాటైంది. టీటీడీ 1000 ఎకరాల స్థలంతో పాటు రెండు భవనాలను కూడా యూనివర్సిటీ ఏర్పాటుకు అందించింది. కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, జువాలజీ, ఫిజిక్స్, ఫిలాసపీ విభాగాలతో ఏర్పడి ఇప్పుడు క్యాంపస్‌లో 54 విభాగాల్లో 72 కోర్సులను అందిస్తోంది. 300 మంది అధ్యాపకులు, 1500 మంది నాన్‌టీచింగ్ సిబ్బంది, 5 వేల మంది విద్యార్థులు కొనసాగుతున్నారు. బోధన, పరిశోధన విస్తరణ రంగాలతో పాటు ఇతర రంగాల్లో కూడా దూసు కెళుతోంది.
మూడు సదస్సుల నిర్వహణ
ఎస్వీయూ ఇటీవల మూడు ప్రతిష్టాత్మక సదస్సులను నిర్వహించింది. డిసెంబర్27 నుంచి 29 వరకు అఖిలభారత ఎకనామిక్స్ కాన్పరెన్స్‌ను నిర్వహించింది. జనవరి 3 నుంచి 7వతేదీ వరకు 104వ సైన్స్ కాంగ్రెస్‌ను, ఫిబ్రవరి 3నుంచి 5వతేదీ వరకు 91వ అఖిల భారత వీసీల సదస్సును నిర్వహించింది. ఈ మూడు సదస్సులకు దేశ,విదేశాల్లోని పలువురు నిపుణులు హాజరయ్యారు. ఇండియన్‌సైన్స్ కాంగ్రెస్‌కు నోబుల్ అవార్డు గ్రహీతలు సైతం హాజరయ్యారు. ఈ సదస్సు నిర్వహణతో ఎస్వీయూ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో నిలిచింది.
అంతర్జాతీయ స్థాయిలో ర్యాంకులు
2015 డిసెంబర్‌లో కేంద్ర మానవవనరుల శాఖ ప్రకటించిన నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ప్రేమ్ వర్క్‌లో ఎస్వీయూకు జాతీయ స్థాయిలో 63వ ర్యాంకు లభించింది. పరిశోధన రంగంలో 13వ స్థానంలో నిలిచింది. గత ఏడాది సెప్టెంబర్ 22న టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్‌లో ఎస్వీయూకు 601–800ల ర్యాంకు లభించింది. ఆసంస్థ బోధన, పరిశోధన, అంతర్జాతీయ ప్రమాణాలు, పారిశ్రామిక రంగాలు తదితర అంశాల ఆధారంగా సర్వే నిర్వహించి ర్యాంకు ప్రకటించింది. ఈ ర్యాంకుల్లో దక్షిణ భారతదేశంలో ఎస్వీయూ మొదటిస్థానంలో నిలిచింది.
ఈ ఏడాది మార్చి 16న టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ సంస్థ ప్రకటించిన ఏషియన్ యూనివర్సిటీల ర్యాంకింగ్‌లో ఎస్వీయూకు ఆసియా ఖండం నుంచి 191–200ల మధ్య ర్యాంకు సాధించింది. దక్షిణ భారతదేశంలో మొదటిస్థానంలో నిలిచింది. తాజాగా సోమవారం కేంద్ర మానవ వనరుల శాఖ ప్రకటించిన ఎన్‌ఐఆర్ ర్యాంకింగ్‌లో ఎస్వీయూ ఓవరాల్ ర్యాంకింగ్‌లో 68వ ర్యాంకు, యూనివర్సిటీ స్థాయిలో 42వ స్థానంలో నిలిచింది. పరిశోధన పరంగా జాతీయ స్థాయిలో 33వ స్థానంలో నిలిచింది. రాష్ట్రస్థాయిలో మొదటిస్థానంలో నిలవడం విశేషం.
అందరి కృషి తోనే
క్యాంపస్‌లోని అధ్యాపకులు, విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు, బోధనేతర సిబ్బంది కషివల్లే ఎస్వీయూకు మంచి ర్యాంకు లభించింది. ఈర్యాంకు రావడానికి అధికారులు ఎంతో శ్రమించారు.