సబ్సిడీ యంత్రం..సిఫార్సు తంత్రం
సబ్సిడీ యంత్రం..సిఫార్సు తంత్రం
Published Sun, Nov 6 2016 11:58 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
- టీడీపీ నేతల సిఫార్సు లెటర్ ఉంటేనే వ్యవసాయ యంత్రాలు
- గ్రామ, మండల స్థాయి కమిటీల ఆమోదం తప్పనిసరి
- ఈ కమిటీలో ఉన్న వారు సైతం టీడీపీ నాయకులే
- రైతులకు తప్పని తిప్పలు
కర్నూలు(అగ్రికల్చర్)/ ఆలూరు రూరల్: సాధారణ రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాలు అందడం లేదు. యాంత్రీకరణకు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ సిఫార్సు లెటర్‌తో ప్రభుత్వం ముడిపెడుతుండం విమర్శలకు తావిస్తోంది. డోన్, బనగానపల్లె, ఆలూరు, మంత్రాలయం, పాణ్యం నియోజకవర్గాల్లో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జిల నుంచి లెటర్ తెచ్చుకుంటేనే యాంత్రీకరణ అంటూ వ్యవసాయ అధికారులు ఖరాకండిగా చెబుతున్నట్లు స్పష్టం అవుతోంది. వ్యవసాయంలో యంత్రాల అవసరం గణనీయంగా పెరిగింది. ప్రభుత్వం కూడ యంత్రీకరణను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. జిల్లాకు 2016–17లో నార్మల్ స్టేట్ ప్లాన్ కింద రూ.13.95 కోట్లు, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద రూ.3.40 కోట్లు, ఎస్‌ఎంఏఎం కింద రూ.3.54 కోట్లు మొత్తంగా రూ.20.69 కోట్లు యాంత్రీకరణ సబ్సిడీగా మంజూరు అయింది. రైతుకు.. 50 శాతం లేదా సబ్సిడీ రూ.2 లక్షలు ఏదీ తక్కువ అయితే దానిని ఇస్తారు. ఈ ఏడాది జిల్లాలో 5861 యంత్రపరికరాలు పంపిణీ చేయాల్సి ఉంది.
ఇలా చేయాలి....
వ్యవసాయ యాంత్రీకరణ కావాలంటే రైతులు తగిన ధ్రువపత్రాలతో మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకుంటే వాటిని ఆన్‌లైన్ ద్వారా సంబంధిత వ్యవసాయాధికారులకు పంపుతారు. అన్ని సక్రమంగా ఉన్నా గ్రామ, మండల స్థాయిలోని కమిటీలు ఆమోదిస్తేనే వీరికి యాంత్రీకరణ దక్కుతుంది. దీని తర్వాత జేడీఏ కార్యాలయ అధికారులు ప్రొసీడింగ్ ఇస్తారు. అనంతరం రైతులు నాన్ సబ్సిడీని డీడీ రూపంలో చెల్లిస్తే సంబంధిత కంపెనీ నుంచి యంత్ర పరికరాన్ని పొందవచ్చు. గ్రామ, మండల స్థాయి కమిటీల్లో టీడీపీ ప్రజాప్రతినిధులే ఉండటంతో అనుచరులకే యంత్రాలు దక్కుతున్నాయి. కొందరు మామూళ్లు పుచ్చు కొని దరఖాస్తులను ఓకే చేస్తున్నట్లు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే గ్రామ, మండల స్థాయి కమిటీలతో అవస్థలు పడుతుంటే తాజాగా వ్యవసాయాధికారులు..టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల సిపారసు లెటర్లు తెచ్చుకోవాలని సూచిస్తుండటంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది.
లెటర్లు తెచ్చుకుంటేనే..
యాంత్రీకరణ కింద ట్రాక్టర్లు, మినీ ట్రాక్టర్లు, రోటోవెటర్, పంట నూర్పిడి యంత్రాలు తదితర వాటికి ఎక్కువగా డిమాండ్ ఉంది. వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్‌చార్జ్‌లు హవా నడుపుతున్నారు. అధికార బలంతో అధికారులను గుప్పిట్లో పెట్టుకొని.. తామిచ్చిన సిఫార్సు లెటర్లకే ప్రధాన్యం ఇవ్వాలని ఆదేశిస్తున్నారు. వ్యవసాయాధికారులూ అదే బాటలో వెళ్తున్నట్లు సమాచారం. మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్నా సిఫార్సు లెటర్ తెచ్చి ఇవ్వాల్సిందే అనే నిబంధనను అనధికారికంగా అమలు చేస్తుండటంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యవసాయ యాంత్రీకరణలో రాజకీయ జోక్యం పెరిగిపోవడంతో అమలు నామమాత్రమే అయిందన్న విమర్శలు ఉన్నాయి.
Advertisement
Advertisement