అపరాల సాగుదార్లకు సబ్సిడీపై స్ప్రింక్లర్లు
అపరాల సాగుదార్లకు సబ్సిడీపై స్ప్రింక్లర్లు
Published Mon, Mar 20 2017 10:55 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
జిల్లా అధికారుల సమీక్షలో కలెక్టర్
కాకినాడ సిటీ: జిల్లాలో రబీ అనంతరం ఒక లక్ష హెక్టార్లలో అపరాల సాగు చేపట్టే రెండువేల మంది మెట్ట ప్రాంత రైతులకు సబ్సిడీపై స్ప్రింక్లర్లు పంపిణీ చేయనున్నట్టు కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ తెలిపారు. కలెక్టరేట్ కోర్టు హాలులో సోమవారం ఆయన వివిధ శాఖల జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. అపరాలను సాగు చేసేందుకు 74,300 మంది రైతులు ముందుకు వచ్చారని, వారికి అవసరమైన విత్తనాల బయోమెట్రిక్ విధానంలో పంపిణీ చేయాలని ఆదేశించారు. ఇటీవల కురిసిన వర్షాలతో మొక్కజొన్న పంటకు వాటిల్లిన నష్టంపై నివేదిక ఇవ్వాలని జేడీని కలెక్టర్ ఆదేశించారు. సామర్లకోటలో బయో ఫెర్టిలైజర్ ప్లాంట్ వచ్చే ఏప్రిల్ చివరి నాటికి వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. జిల్లాలోని పాఠశాలలు, వసతి గృహాలు, ఆస్పత్రుల్లో విద్యుత్ బకాయిల చెల్లింపునకు చర్యలు చేపడతున్నారని, వాటికి విద్యుత్ కనెక్షన్లు తొలగించవద్దన్నారు. ఒక వేళ తొలగిస్తే వెంటనే పునరుద్ధరించాలని ట్రాన్స్‌కో ఎస్‌ఈకి కలెక్టర్ సూచించారు.
ఏజెన్సీలో మహిళలకు ఐరన్ సుక్రోజ్ ఇంజక్షన్లు
ఏజెన్సీలోని మహిళల్లో రక్తంలో హెచ్‌బీ 8 శాతం కంటే తక్కువ ఉన్న వారికి ఐరన్ సుక్రోజ్ ఇంజక్షన్లు ఇవ్వాలని డీఎం అండ్ హెచ్‌ఓను కలెక్టర్ ఆదేశించారు. ఏజెన్సీలో పౌష్టికాహారం పంపిణీలో భాగంగా రేషన్‌కార్డులపై పంపిణీ చేస్తున్న రూ.40కు కిలో కందిపప్పు అన్ని కుటుంబాలకు అందేలా చర్యలు చేపట్టాలన్నారు. ఏజెన్సీలో పెసరపప్పు పంపిణీ చేసేందుకు ప్రభుత్వానికి నివేదించాలని పౌరసరఫరాల శాఖ అధికారులకు కలెక్టర్ సూచించారు. సబ్‌ప్లాన్ నిధులను వివిధ ప్రభుత్వ శాఖలు సక్రమంగా వినియోగించాలని ఆదేశించారు.
నాణ్యతతో సీసీ రోడ్ల నిర్మాణాలు
జిల్లాలో సీసీ రోడ్ల నిర్మాణాలలో పూర్తిస్థాయి నాణ్యత ఉండాలని పంచాయతీరాజ్ ఇంజనీర్లకు కలెక్టర్ సూచించారు. ఏప్రిల్ 24న పంచాయతీరాజ్ దినోత్సవం నాటికి జిల్లాలో 600 గ్రామాలు బహిరంగ మలవిసర్జన లేని గ్రామాలుగా ప్రకటించి ఆయా గ్రామాల సర్పంచ్‌లను అభినందించనున్నట్టు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో పింఛనుదార్ల ఆధార్ నంబర్ నమోదులో ఉన్న తప్పులను రెండు రోజుల్లో సరిచేయాలని ఆదేశించారు.
ఘనంగా అంబేడ్కర్ 125వ జయంత్యుత్సవ ముగింపు
ఏప్రిల్ 14న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125 జయంత్యుత్సవ ముగింపు కార్యక్రమం జిల్లాలో ఘనంగా నిర్వహించనున్నట్టు కలెక్టర్ తెలిపారు. జిల్లా, డివిజన్‌స్థాయిల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ, జేసీ–2 జె.రాధాకృష్ణమూర్తి, డీఆర్వో బీఎల్ చెన్నకేశవరావు, జిల్లాపరిషత్ సీఈఓ కె.పద్మ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Advertisement