- హైకోర్టు ఆదేశాలతో విధుల్లోకి తీసుకున్న విద్యాశాఖ
ఫలించిన వృత్తివిద్యాబోధకుల పోరాటం
Published Sat, Sep 17 2016 12:01 AM | Last Updated on Mon, Sep 4 2017 1:45 PM
కరీంనగర్ ఎడ్యుకేషన్: సర్వశిక్షా అభియాన్ ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఆర్ట్, క్రాఫ్ట్, పీఈటీ టీచర్ల పోరాటం ఫలించింది. గత నాలుగు నెలలుగా తమను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ అనేక ఆందోళనలు చేపట్టి విజయం సాధించారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు వారిని శుక్రవారం జిల్లా విద్యాశాఖ విధుల్లోకి తీసుకుంది. విద్యాసంవత్సరం ప్రారంభంలోనే తిరిగి వారిని విధుల్లోకి తీసుకోవాల్సి ఉండగా.. సర్వశిక్షాభియాన్ అధికారులు రాష్ట్ర అధికారుల ఆదేశాల మేరకు విధుల్లోకి తీసుకోలేదు. దీంతో జిల్లావ్యాప్తంగా పనిచేస్తున్న 310 మంది పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్లు ప్రజాప్రతినిధులను, విద్యాశాఖ జిల్లా, రాష్ట్ర అధికారులను కలిసి అనేకమార్లు వినతిపత్రాలు సమర్పించారు. అయినా వీరి నియమాకానికి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు వారికి అనుకూలంగా తీర్పునిస్తూ విధుల్లోకి తీసుకోవాలని ఆదేశాలిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ అధికారులకు నాలుగు రోజుల క్రితం జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మళ్లీ విద్యాశాఖ అధికారులు వారి విద్యార్హత ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎస్‌ఎంసీ కమిటీల నుంచి వారి వివరాలను సేకరించి తిరిగి విధుల్లోకి చేర్చుకుంటున్నారు. జిల్లాలో ఆర్ట్ ఎడ్యుకేషన్‌లో 93 మంది, పీఈటీలు 69 మంది, వర్క్ ఎడ్యుకేషన్, కంప్యూటర్స్‌లో 74మందిని తిరిగి విధుల్లోకి తీసుకుంది. మిగతా 74 మంది విద్యార్హత ధ్రువీకరణ పత్రాల వెరిఫికేషన్ పూర్తయిన తరువాత నియమాకాలు చేపట్టేందుకు జిల్లా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. కాగా.. వృత్తివిద్యాబోధకులను తిరిగి విధుల్లోకి తీసుకోవడంపై ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు తాడూరి లక్ష్మీనారాయణతోపాటు ఆడెపు సంపత్, రఘు, కేశవ్, తిరుపతి, సత్యనారాయణ, ఆనంద్‌కుమార్, కిషన్, గోపాల్, నర్సయ్య, చంద్రకళ, గీతారాణి, మంజుల, అనురాధ, విజయలక్ష్మి, అనిత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
Advertisement
Advertisement