తెలుగు పాటలో తియ్యదనం తగ్గింది
-
మంచి పాటలు పది కాలాల పాటు పదిలం
-
ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ
కొయ్యూరు: తెలుగింటి ఆడపడుచును పల్లకిలో ఊరేగించినంత అందంగా ఒకప్పుడు మన పాట ఉండేదని, నేడు అదే తెలుగింటి అమ్మాయిని జీపునకు కట్టి ఈడ్చినట్టుగా తయారైందని ప్రముఖ పాటల రచయిత సుద్దాల అశోక్‌తేజ అన్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఉద్యమం నడిపిన మంప, రాజేంద్రపాలెంలలో స్మారకమందిరాలను ఆయన ఆదివారం సందర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
తెలుగు పాటల్లో తేడాలొచ్చాయి
నాటికీ నేటికి తెలుగుపాటల్లో చాలా తేడాలొచ్చాయి. అప్పట్లో సంగీతాన్ని సాహిత్యం అధిగమించేలా ఉంటే ఇప్పుడు సాహిత్యాన్ని సంగీతం అధిగమిస్తుంది. పాట మంచిదైతే పది కాలల పాటు ప్రజల మదిలో ఉంటుంది. ఇప్పుడు మంచి పాటలు రాసే రచయితలు ఎందరో ఉన్నా అలా రాసే అవకాశం తగ్గిపోతుంది. దర్శక నిర్మాతలు చెప్పిన దానికి వీలుగా రాయాలి.
‘నేను సైతం’ జాతీయఅవార్డు అందుకున్నా
ఠాగూర్‌కు నేను రాసిన ‘నేను సైతం’ పాటకు జాతీయ అవార్డు రావడం ఎన్నటికీ మరువలేను. ఆ అవార్డు తీసుకున్న మూడో తెలుగు పాటల రచయితను అయినందుకు ఆనందంగా ఉంది.
‘ధ్రువ’కు రాసే అవకాశం
ప్రస్తుతం రామ్‌చరణ్ నటిస్తున్న ధ్రువలో ఒక పాట రాసేందుకు చర్చలు జరిగాయి. దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటాం. శేఖర్‌కమ్ముల తీస్తున్న సినిమాకు పాటలు రాసే దానిపై చర్చలు జరుగుతున్నాయి.
తన్మయత్వం పొందాను
మన్యంలో అల్లూరి నడయాడిన ఈ ప్రాంతాన్ని చూసిన వెంటనే మనసు తన్మయత్వానికి లోనయింది.
‘అల్లూరి’ ప్రాంతాల అభివృద్ధికి వందకోట్లు ఇవ్వాలి
బ్రిటిష్ సేనలకు వ్యతిరేకంగా గొప్ప సాయుధ పోరాటం నడిపిన అల్లూరికి ఇవ్వాల్సిన ప్రాధాన్యం ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఆయన నడయాడిన ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు తక్షణం రూ.వంద కోట్లు కేటాయించాలి.
‘భగత్‌సింగ్’లాంటి పోరాటయోధుడు
జలియన్ వాలాబాగ్ సంఘటన తర్వాత భగత్‌సింగ్ పోరాటయోధుడైతే ఇక్కడ నేరుగా ఉద్యమాన్ని నడిపిన గొప్ప వ్యక్తి అల్లూరి సీతారామరాజు. పంజాబ్ ప్రభుత్వం భగత్‌సింగ్‌కు ఎంతో ప్రాధాన్యం ఇస్తుంది.
అల్లూరి ప్రాంతాలను ఇలా ఉంచడం బాధాకరం
అల్లూరి సీతారామరాజు సినిమా రాక ముందు పడాల రామారావు రాసిన ఆంధ్రాశ్రీ పుస్తకంలో ఉన్న అల్లూరి చరిత్రను మా తండ్రి ద్వారా చదివి ఆలకించాను. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు కావస్తున్నా అల్లూరి నడయాడిన ప్రాంతాలను ఈ విధంగా ఉంచడం బాధాకరం.
మ్యూజియం ఏర్పాటు చేయాలి
ఇప్పుడు పుష్కరాలకు ప్రభుత్వం ఎంత కేటాయించి వైభవంగా నిర్వహిస్తుందో అదే విధంగా అల్లూరి ప్రాంతాలకు పుష్కరశోభను తీసుకురావాలి. మ్యూజియం ఏర్పాటు చేసి అల్లూరి వాడిన వస్తువులను భద్రపరచాలి. ఆయనకు సంబంధించిన అన్ని విషయాలను, తిరిగిన ప్రాంతాల వివరాలను అందులో పొందుపరచాలి. రోజుకు పదివేల మంది పర్యాటకులు సందర్శించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.