
అమరుడి తల్లి ఆత్మహత్యాయత్నం
* ప్రభుత్వ సహాయం కోసం వినతి
* అవతరణ వేడుకల్లోనే పురుగుల మందు తాగిన సుగుణమ్మ
ఖమ్మం: కొడుకు తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వసాయం పొందుతున్న కోడలు పట్టించుకోవడం లేదు. దిక్కుతోచనిస్థితిలో ఓ అమరవీరుడితల్లి ఆత్మహత్యకు యత్నించింది. గురువారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు జరుగుతున్న ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లోనే ఈ ఘటన కలకలం సృష్టించింది. నల్లగొండ జిల్లా మునగాల మండలం రేపల్లెకు చెందిన రావు సుధాకర్‌రెడ్డి తెలంగాణ రాదేమోననే బెంగతో ఖమ్మం జిల్లా ముదిగొండ పరిసర ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్నాడు.
సుధాకర్‌రెడ్డికి తల్లి సుగుణమ్మ, సోదరుడు సురేందర్‌రెడ్డితోపాటు భార్య శకుంతల, ఇద్దరు కుమారులున్నారు. శకుంతల ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. దీం తో తన చిన్న కుమారుడు సురేందర్‌రెడ్డికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని సుగుణమ్మ కోడలిని కోరగా కుటుంబ తగాదాల కారణంగా నిరాకరించింది. అయితే, ఖమ్మంలో జరిగిన వేడుకల్లో అధికారులు శకుంతలకు రూ.10 లక్షల చెక్కు అందించారు. ఈ నేపథ్యంలో సుగుణమ్మ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా అధికారులను కలిసేందుకు ప్రయత్నించగా అధికారులు అడ్డుకున్నారు. పక్కకు వెళ్లిన సుగుణమ్మ పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. అపస్మారకస్థితిలో ఉన్న సుగుణమ్మ పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.