నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ పర్యాటకులకు స్వర్గధామంగా మారింది. వేసవి సెలవుల్లో ఈ ప్రాంతంలోని నాగార్జున సాగర్ డ్యాం, బుద్ధవనం, నాగార్జునకొండ మ్యూజియం తదితర ప్రాంతాలను సందర్శించవచ్చు. ఒకరోజు సాగర్‌లో విడిది చేయాలనుకునే వారు ముందుగానే హిల్‌కాలనీలోని విజయవిహార్ అతిథిగృహంలో గదులను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే అవకాశముంది. రైట్ బ్యాంకులోని మాత సరోవర్ రిసార్ట్స్‌లో గదులను బుక్ చేసుకునే వీలుంది. అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా పేరుపొందిన సాగర్‌తో పాటు చుట్టుపక్కల దర్శనీయ స్థలాలను చూడడానికి సుదూర ప్రాంతాలనుంచి పర్యాటకులు వస్తూనే ఉంటారు వారాంతంలో అత్యధిక సంఖ్యలో పర్యాటకులు సందర్శనకు వస్తారు.
నాగార్జునసాగర్ ఎడమకాల్వ దగ్గరినుంచి జలాశయంలోకి చూస్తే కాశ్మీరును తలపించే నీటి అంచున ఎత్తైన పచ్చని చెట్లతో కూడిన గుట్టలు వాటి నీడ నీటిలో పడి దాల్ సరస్సును తలపిస్తుంది. ప్రధాన డ్యాంనకు ఎడమవైపున ఉన్న ఎర్తుడ్యాంపై పరిచిన గడ్డి మరో పక్క కనిపించే కృష్ణమ్మ అందాలు తనివితీరా చూడాల్సిందే. పిల్లర్ పార్కు అందాలు అక్కడి నుంచి చూస్తే కనిపించే జలాశయ సోయగం పర్యాటకులను మంత్ర ముగ్ధులను చేస్తుంది. ప్రధాన డ్యాం క్రస్ట్‌గేట్లు చూడాల్సిన ఆవశ్యకత ఎంతైన ఉంది.
బుద్ధవనం
సాగర్‌కు తలమానికంగా నిలిచిన బుద్ధవనం పార్కులు ఆహ్లాదకరంగా ఉంటాయి. బుద్ధుడి ప్రతిమలతో పాటు ఆయన జీవిత చరిత్రను తెలిపే విగ్రహాలు పార్కులో వెలిశాయి. నేలపై తివాచీలు పరిచినట్లు ఉండే పచ్చని గడ్డి, పూల వనాలు రకరకాల మొక్కలు, దేశంలో ఉన్న బుద్ధచరిత్రకు సంబంధించిన అన్ని రకాల చైతన్యాలు ఇక్కడ నిర్మితమయ్యాయి.
ఎత్తిపోతల జలపాతం
సాగర్‌కు 15 కిలోమీటర్ల దూరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో చంద్రవంక నదిపై సహజసిద్ధంగా ఏర్పడింది ఎత్తిపోతల జలపాతం. ఇది 70 అడుగుల పైనుంచి జాలువారే జలపాతం. పర్యాటకుల మనస్సును ఇట్టే ఆకర్షిస్తుంది. పూర్వకాలంలో యతులు తపస్సు చేసుకునే ప్రాంతం కావడంతో ఎత్తిపోతల అనే పేరు వచ్చింది. సాగర్‌నుంచి ముగ్గురు నలుగురు కలిసి ఆటో మాట్లాడుకొని వెళ్లాలి.
నాగార్జునకొండ మ్యూజియం
సాగర్‌కు 14 కిలోమీటర్ల దూరంలో జలాశయం మ«ధ్యలో నాగార్జునకొండ ఉంటుంది. ఇక్కడకు వెళ్లడానికి లాంచీలలో ప్రయాణం చేయాలి. ఇప్పుడు తెలంగాణ ప్రాంతం నుంచే లాంచీలను నడుపుతున్నారు. ఇది నాగార్జునుడు నడయాడిన ప్రాంతం. బుద్ధుని స్థూపాలు, చైత్యాలు, అలనాటి వస్తువులు బుద్ధుడి చరిత్రకు సంబంధించిన ఆయా స్థంభాలు ఉన్నాయి.
నాగార్జున విశ్వవిద్యాలయం
అనుపు ఆనాడు ప్రపంచ దేశాలకు విద్యనందించిన విశ్వవిద్యాలయం ఆనవాళ్లు అనుపులో నిక్షిప్తమై ఉన్నాయి. యాంపీ స్టేడియం, విద్యార్థుల వసతి గృహాలు గురు పరంపర సాగిన విధానం ఇక్కడ చూస్తే చరిత్రకారులకు కళ్లకు కట్టినట్లు అర్థమవుతుంది.
ప్రధాన విద్యుత్ కేంద్రం
డ్యాం దిగువన ప్రధాన విద్యుత్ కేంద్రం ఉంది. దీనిని జెన్‌కో ఎస్‌ఈ అనుమతితో సందర్శించవచ్చు.
విజయవిహార్ అతిథిగృహం
ఎందరో ప్రముఖుల విడిదిచేసిన ఈ విశ్రాంతి గృహం అహ్లాదకరంగా ఉంటుంది. చక్కని వసతి, స్విమ్మింగ్ పూల్ సౌకర్యం ఉంది. ఆన్‌లైన్ బుకింగ్ ఉంటుంది.
విజయవిహార్ షూట్స్ (ఏసీ)10. శుక్ర, శని, ఆదివారాల్లో ధర రూ.3,935లు ఫోన్ 08680 277362
సమాగమమ్ (ఏసీ)18. ధర రూ.2,473లు ఫోన్ 08680 277363
సరోవర్(ఏసీ)8 ధర రూ.2,810లు.
సోమవారం నుంచి గురువారం వరకు వేరే రేట్లు ఉంటాయి.
ఇవే కాకుండా బుద్ధవనంలో మూడు ఏసీ షూట్స్ ఉన్నాయి. మూడు కాటేజీలు అందుబాటులో ఉంటాయి. ఫోన్ 9640883535
రైట్‌బ్యాంకులోని మాతసరోవర్‌లో అత్యాధునికమైన సౌకర్యాలతో ఏసీ, నాన్ ఏసీ గదులు ఉన్నాయి. వివరాలకు 08642–242429, 8500718552
సాగర్‌లో సందర్శకులకు సరిపోయే సౌకర్యాలు లేవు. అందువల్ల పర్యాటకులు తమ వెంట తాగునీటితో పాటు చిన్న పిల్లలకు బిస్కట్లు, పాలు లాంటివి తెచ్చుకుంటే మంచిది.
సాగర్ జలాశయంలో కాని దిగువ కృష్ణానదిలో కాని ఈతకు దిగవద్దు. నీటిలోతు తెలియదు ఎప్పుడు ఏనీరు ఎక్కడి నుంచి వస్తుందో పసిగట్టలేరు కాబట్టి నీటిలోనికి దిగకుండా ఉంటే మంచిది.