పండు వెన్నెల..గుండె నిండుగా!
పండు వెన్నెల..గుండె నిండుగా!
Published Mon, Nov 14 2016 10:17 PM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
- కార్తిక పౌర్ణమిన పోటెత్తిన ఆలయాలు
- శ్రీశైలంలో కనులపండువగా జ్వాలాతోరణం
- శాస్త్రోక్తంగా నదీహారతులు
- పాతాళగంగలో పుణ్యస్నానాలు
కార్తిక సోమవారం..పౌర్ణమి పర్వదినం..దీపకాంతులతో దివి వెలుగు లీనింది. ఆనంద తాండవం చేసింది. భక్తిపారవశ్యంతో మునిగి తేలింది. జ్యోతుల ప్రజ్వలన..దీపార్చనతో ఆధ్యాత్మిక భావన కాంతులు వెదజల్లింది. పండు వెన్నెల..గుండె నిండుగా నింపుకొని భక్తజనం పరవశించింది. భగవన్నామస్మరణతో మదిమదిలో భక్తిభావం ఓలలాడింది.
శ్రీశైలం: కార్తిక పౌర్ణమి రోజున జిల్లాలో ప్రముఖ క్షేత్రాలన్నీ భక్తజనంతో పోటెత్తాయి. ఇష్ట దైవాలను పూజిస్తూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక ఆనందంలో మునిగి తేలారు. శ్రీశైలంలో జ్వాలాతోరణం కనులపండువగా సాగింది. ప్రధానాలయ రాజగోపుర వీధిలో ఉన్న గంగాధర మండపం వద్ద సోమవారం రాత్రి 7గంటల తరువాత జ్వాలాతోరణాన్ని వెలిగించారు. జ్వాలాతోరణ దర్శనంతో సర్వపాపాలు తొలగి..అష్టైశ్వర్యాలు సమకూరుతాయని భక్తుల విశ్వాసం. జ్వాలాతోరణ కాటుకను ధరించడం వల్ల సర్వభయాలు వీడి, భూత ప్రేత పిశాచ బాధలు తొలగి, సకల శుభాలు కలుగుతాయని భావిస్తుంటారు. త్రిపురాసుర రాక్షస సంహారానంతరం పరమేశ్వరునిపై పడ్డ దృష్టి దోషపరిహారం కోసం విజేయుడైన ఆ ఈశ్వరుని గౌరవార్థం పార్వతీదేవి కార్తిక పౌర్ణమిరోజున జ్వాలా తోరణోత్సవాన్ని జరిపిందని పురాణాల ద్వారా తెలుస్తుంది.
కృష్ణమ్మకు నదీహారతులు..
కార్తిక పౌర్ణమి సందర్భంగా పాతాళగంగ తీరంలో కృష్ణవేణీ తల్లికి వేదమంత్రోచ్ఛారణల మధ్య మంగళ వాయిద్యాల నడుమ ఏకాదశ (11 రకాలైన) హారతులు ఇచ్చారు. సోమవారం సాయంత్రం సంధ్యవేళలో పాతాళగంగ స్నానఘట్టాల వద్ద లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకులు, వేదపండితులు సంకల్పం పఠించారు. అనంతరం కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు విఘ్నేశ్వరపూజ, తరువాత కృష్ణవేణీ మాతకు శాస్త్రాన్ని అనుసరించి ఏక, నేత్ర, బిల్వ, నాగ, పంచ, పుష్ప, నంది, సింహ, నక్షత్ర, విష్ణు, కుంభహారతులను ఇచ్చారు. ఆ తరువాత 11 మంది అర్చకులు నదీమాతల్లికి కర్పూర నీరాజనాలను సమర్పించారు.
భక్తుల పుణ్యస్నానాలు..
కార్తిక పౌర్ణమి పర్వదిన సందర్భంగా వేలాది మంది భక్తులు పవిత్ర పాతాళగంగలో పుణ్యస్నానాలాచరించుకుని కృష్ణమ్మకు వాయనాలు సమర్పించుకున్నారు. వేకువ జామున 3గంటల నుంచే భక్తులు పుణ్యస్నానాలాచరించుకోవడానికి మెట్లమార్గం ద్వారా పాతాళగంగకు చేరుకున్నారు. బ్రహ్మీ ముహూర్తం నుంచి సాయంత్రం వరకు దాదాపు లక్షకు పైగా భక్తులు పుణ్యనదీ స్నానాలాచరించుకున్నట్లు అధికారుల అంచనా. అనంతరం శ్రీ భ్రమరాంబామల్లికార్జునస్వామివార్ల దర్శించుకోవడానికి క్యూలలో బారులు తీరారు. క్యూ కాంప్లెక్స్ నిండిపోవడంతో ప్రధాన రథవీధిలోని గంగాధర మండపం వరకు భక్తులు రోడ్డుపైనే క్యూ కట్టారు. సుమారు1200లకు పైగా సామూహిక అభిషేకాలను అక్కమహాదేవి అలంకార మండపంలో నిర్వహించారు. సాధారణ భక్తులందరికీ వేవకుజామున 3.30గంటల నుంచి మల్లన్న సర్వదర్శనాన్ని ఏర్పాటు చేశారు.
అలరించిన శివతాండవం :
పుణ్యహారతిలో భాగంగా సోమవారం సాయంత్రం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో తిరుపతి నాటిక కళా సంస్థ వారి శివతాండవం, గిరిజా కల్యాణం నృత్యరూపకం భక్తులను ఆకట్టుకుంది. పాతాళగంగ మెట్ల వద్ద తాత్కాలిక ఫంటు ఏర్పాటు చేసి ప్రత్యేక పుష్పాలకరణ చేశారు. దీనికి ముందుగా ప్రముఖ ప్రవాచకులు డాక్టర్ హయగ్రీవాచారి కార్తిక మాస విశిష్టత పై ప్రవచనాలను వినిపించారు.
Advertisement
Advertisement