నిరుపయోగంగా కమ్యూనిటీ భవనాలు
నడిగూడెం: మండల పరిధిలోని పలు గ్రామాల్లో పదేళ్ల క్రితం కమ్యూనిటీల ఐఖ్యత, అభివద్ధి కోసం లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన కమ్యూనిటీ భవనాలు నేడు నిరుపయోగంగా మారాయి. సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యంతోనే ఆ భవనాలు నిరుపయోగంగా ఉంటున్నాయని ప్రజలు అంటున్నారు. ఆ భవనాలను నిర్మించిన నాటి నుంచి ప్రారంభించకపోవడంతో నేడు పలు గ్రామాల్లో కమ్యూనిటీ భవనాలు పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. నిర్మాణ సమయంలో పలు మౌలిక సౌకర్యాలు కల్పించకపోవడంతోనే ఉపయోగించుకోలేక పోతున్నామని ప్రజలు వాపోతున్నారు. ప్రధానంగా మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ఆరు లక్షల రూపాయలతో నిర్మించిన కమ్యూనిటీ భవనం నేడు పూర్తిగా శిథిలావస్థకు చేరింది.
దర్వాజలు, కిటికీలు దొంగలపాలు..
బృందావనపురం ఎస్సీ కమ్యూనిటీ భవనంలో దర్వాజలు, కిటికీలు దొంగలపాలయ్యాయి. రత్నవవరం, కాగితరామచంద్రాపురం, సిరిపురం, శ్రీరంగాపురం, రామాపురం, గ్రామాల్లోని ఎస్సీ కమ్యూనిటీ భవనాలు, శ్రీరంగాపురం, తెల్లబెల్లి, త్రిపురవరం, గ్రామాల్లోని బీసీ కమ్యూనిటీ భవనాలు పరిస్థితి కూడా అదేవిధంగా ఉంది. ఆరు నెలల కిందట వేణుగోపాలపురంలో ఎనిమిది లక్షల రూపాయలతో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ భవనం ప్రారంభానికి నోచుకోలేదు. సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి మండలంలో నిరుపయోగంగా ఉంటున్న కమ్యూనిటీ భవనాలను పరిశీలించి, దినపత్రికలు, మాస పత్రికలు, ఫ్యాన్‌లు, కుర్చీల ఏర్పాటు తదితర సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఉపయోగంలోకి తీసుకరావాలి.....ఎల్.వీరబాబు,
మా గ్రామంలో బీసీ, ఎస్సీ కాలనీల్లో నిర్మించిన కమ్యూనిటీ భవనాలు నిరుపయోగంగా ఉంటున్నాయి. లక్షల రూపాయల వ్యయంతో ఆ భవనాలను నిర్మించారు. కానీ ఉపయోగయోగ్యంగా లేవు. సంబంధిత అధికారులు స్పందించి కమ్యూనిటీ భవనాలను ఉపయోగంలోకి తీసుకరావాలి.
మౌలిక సౌకర్యాలు కల్పించాలి.......కాసాని కిషోర్,
నిరుపయోగంగా ఉంటున్న కమ్యూనిటీ భవనాల్లో ప్రజలకు కావాల్సిన దినపత్రిలు, వారపత్రికలు, మాస పత్రికలతో పాటు ఫ్యాన్‌లు, కుర్చీలు ఏర్పాటు చేయాలి. దీంతో కమ్యూనిటీల్లో ఐక్యత పెరుగుతుంది. యువతకు కావాల్సిన పరిజ్ఞానం అందుతుంది.