ఏపీ ఎంసెట్ ఫలితాలపై సస్పెన్స్
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ఫలితాలు విడుదలపై గందరగోళం నెలకొంది. 'నీట్'పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో ఎంసెట్ ఫలితాల విడుదలపై సందిగ్ధం ఏర్పడింది. ఫలితాలు విడుదల చేయాలా, వద్దా అనే దానిపై మంత్రులు, ఉన్నతాధికారులు తర్జనభర్జనలు పడుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత దానికి అనుగుణంగా ఫలితాలు విడుదల చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. సుప్రీంకోర్టు తీర్పును అధ్యయం చేసిన తర్వాతే ఫలితాలు విడుదల చేయాలనుకుంటున్నారు.
మరోవైపు ఇంజినీరింగ్ ఫలితాలు ముందుగా విడుదల చేసిన తర్వాత మెడికల్ ఫలితాలు విడుదల చేయాలని యోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ఎంసెట్ ఫలితాల విడుదల ఆలస్యమయ్యే అవకాశం కన్పిస్తోంది. ముందుగా ప్రకటించిన దాని ప్రకారం ఈ సాయంత్రం 5 గంటలకు ఫలితాలు విడుదల కావాల్సివుంది. ఉన్నతాధికారులతో మంత్రులు కామినేని శ్రీనివాస్, అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పుల్లారావు సంప్రదింపులు జరుపుతున్నారు.