స్పెషల్ పార్టీ కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు
Published Fri, Jun 9 2017 11:55 PM | Last Updated on Sun, Sep 2 2018 3:08 PM
కర్నూలు: నగరంలోని రాజ్‌విహార్ సెంటర్‌లో ట్రాఫిక్ విధుల్లో ఉన్న హోంగార్డు హుస్సేన్‌పై దాడికి పాల్పడిన స్పెషల్ పార్టీ కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు పడింది. గురువారం సాయంత్రం హోంగార్డు హుస్సేన్ రాజ్‌విహార్ సెంటర్‌లో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తుండగా స్పెషల్ పార్టీ కానిస్టేబుళ్లు మనోజ్, అతని తమ్ముడు మణికుమార్ ద్విచక్ర వాహనంపై రాజ్‌విహార్ చేరుకున్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగే విధంగా రోడ్డుపై వాహనాన్ని నిలుపుకుని ఫోన్‌లో మాట్లాడుతుండగా సైడ్‌కు వెళ్లండంటూ హోంగార్డు చెప్పాడు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించినందుకు కోపోద్రిక్తుడైన మనోజ్‌కుమార్ సోదరులు హోంగార్డు హుస్సేన్‌పై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనను ‘ఫూలీసులు’ శీర్షికన శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఎస్పీ ఆకె రవికృష్ణ స్పందించారు.
శుక్రవారం ఉదయం హోంగార్డు హుస్సేన్‌ను కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు పిలిపించి విచారించారు. ఆ తర్వాత కానిస్టేబుళ్లు ఇద్దరినీ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి తనకు నివేదిక సమర్పించాలని రెండవ పట్టణ సీఐ డేగల ప్రభాకర్‌ను ఆదేశించారు. రాజ్‌విహార్ సెంటర్‌లోని సీసీ కెమెరాలో నిక్షిప్తమైన ఫుటేజీలను కూడా సేకరించాలన్నారు. అలాగే మనోజ్‌కుమార్ సోదరులు పోలీస్ శాఖలో చేరకముందు ప్రవర్తన ఎలా ఉండేది.. వారిపై ఎన్ని కేసులు ఉన్నాయనే విషయాలపైనా పూర్తిస్థాయిలో విచారణకు ఆదేశించారు. వీరిపై రౌడీషీట్లు నమోదై ఉంటే ఉద్యోగంలో చేరేటప్పుడు స్పెషల్ బ్రాంచ్ ఉద్యోగులు ఎందుకు తప్పుడు నివేదిక ఇచ్చారనే విషయంపైనా విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఎస్పీ ఆదేశించినట్లు సమాచారం.
Advertisement
Advertisement