వైభవో పేతం.. స్వాతి మహోత్సవం
ఆళ్లగడ్డ: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో బుధవారం స్వాతి వేడుకలను వైభవోపేతంగా నిర్వహించారు. స్వామి జన్మనక్షత్రం స్వాతిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. దిగువ అహోబిలంలో కొలువైన శ్రీ ప్రహ్లాద వరద, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు తెల్లవారుజామున విశ్వరూప సేవ చేశారు. ఉత్సవమూర్తులను కల్యాణ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో కొలువుంచి ముద్రకర్త శ్రీమాణ్‌వేణుగోపాలన్, మణియార్ వైకుంఠంస్వామిల ఆధ్వర్యంలో అభిషేకం, అర్చన, తిరుమంజనం నిర్వహించారు. స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి.. భక్తుల దర్శనం కోసం ఉంచారు. అనంతరం స్వాతి, సుదర్శన హోమాలను ఘనంగా జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో నవlనారసింహ క్షేత్రాలు కిటకిటలాడాయి.