త్వరలో తీపి కబురు!
♦ క్రాప్ ఆన్ డేట్ కారణంగా పెండింగ్‌లో ఉన్న 2012 రబీ బీమా దర ఖాస్తులకు క్లియరెన్స్
♦ 17 వేల మంది రైతులకు ఊరట.. 2వ జాబితాలో 7వేల మందికి అప్రూవల్
♦ ఏఐసీ జీఎంతో ఎంపీ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి సమావేశం
♦ సీఎండి జోసెఫ్‌తో ఫోన్‌లో చర్చించిన ఎంపీ
సాక్షి ప్రతినిధి, కడప : పంటల బీమా కోసం మూడేళ్లుగా కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న 17 వేల మంది రైతులకు చెందిన సమస్యకు పరిష్కారం లభించింది. హైదరాబాద్‌లో సోమవారం ఏఐసీ (అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) జీఎం రాజేశ్వరితో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి సమావేశమై 2012 రబీ బీమా గురించి చర్చించారు. ‘2012లో చెల్లించిన ప్రీమియంకు బీమా చెల్లించకుండా రైతులను క్షోభకు గురిచేస్తున్నారు. ఇప్పటికీ దాదాపు 25 వేల మంది రైతులు నిరీక్షిస్తున్నారు. ఎప్పటి కి పరిష్కారం చూపిస్తారు.. రైతులకు బీమా చెల్లించేందుకు మీకు ఇంకెంత సమయం కావాల’ని ఇన్సూరెన్స్ కంపెనీ జనరల్ మేనేజర్‌ను ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే పి రవీంద్రనాథరెడ్డి నిలదీశారు. 2012-13 సంవత్సరానికి చెందిన రబీ సీజన్ పంటల బీమా తొలి జాబితాలో 28 వేల మంది రైతులకు రూ.132 కోట్లు మంజూరైంది.
మరో 25 వేల మంది రైతులకు మంజూరు కాలేదు. వారి క్లైయిమ్స్ పెండింగ్‌లో ఉండిపోయాయి. ఈ విషయమై ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి వ్యవసాయ శాఖ కమిషనర్ ధనుంజయరెడ్డి, ఎఐసీ జీఎం రాజేశ్వరితో ఇప్పటికే పలుమార్లు చర్చించారు. 17 వేల మంది రైతులకు చెందిన దరఖాస్తుల్లో క్రాప్ ఆన్ డేట్ నమోదు చేయలేదని పెండింగ్‌లో ఉంచారు. వీటిపై అగ్రికల్చర్ కమిషనర్ ధనుంజయరెడ్డి మండలాల వారిగా క్రాప్ ఆన్ డేట్ రైతుల జాబితాను ఏఐసీ కార్యాలయానికి అందించారు. ఆ మేరకు నెలలోపు రైతులకు బీమా మంజూరు చేయాలని అధికారికంగా లేఖ సైతం రాశారు. మూడు రోజుల క్రితం రాసిన ఆ లేఖను సోమవారం ఎంపీ, ఎమ్మెల్యేల సమక్షంలో ఏఐసీ జీఎం రాజేశ్వరి న్యూఢిల్లీలోని ప్రధాన కార్యాలయానికి సిఫార్సు చేశారు.
దాంతో 17 వేల మంది రైతులకు చెందిన సమస్యకు పరిష్కారం లభించింది. 17 వేల మంది రైతులకు చెందిన పంటల బీమాను మంజూరు చేయాలని ఏఐసీ సీఎండీ జోసెఫ్‌తో ఎంపీ అవినాష్‌రెడ్డి ఫోన్ ద్వారా చర్చించారు. ప్రధాన కార్యాలయం నుంచి వీలైనంత త్వరగా పరిష్కారం చూపుతామని ఆయన హామీ ఇచ్చినట్లు ఎంపీ తెలిపారు. రెండవ జాబితాగా 7 వేల పైచిలుకు మంది రైతులకు చెందిన దరఖాస్తులకు అప్రూవల్ ఇచ్చామని సీఎండి ఈ సందర్భంగా ఆయనకు వివరించారు. ఎంపీ, ఎమ్మెల్యేల కృషి ఫలితంగా రైతులకు త్వరలో తీపి కబురు అందనుంది.