ఉక్కు తయారీలో అగ్రస్థానమే లక్ష్యం | target first place in steel production | Sakshi
Sakshi News home page

ఉక్కు తయారీలో అగ్రస్థానమే లక్ష్యం

Published Fri, Aug 21 2015 1:03 AM | Last Updated on Sun, Sep 3 2017 7:48 AM

ఉక్కు తయారీలో అగ్రస్థానమే లక్ష్యం

ఉక్కు తయారీలో అగ్రస్థానమే లక్ష్యం

సాక్షి, హైదరాబాద్: ఉక్కు తయారీలో ప్రపంచంలోనే అగ్రస్థానాన్ని చేరుకునేందుకు కేంద్రప్రభుత్వం భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) డెరైక్టర్ ఎస్.ఎస్.మహంతి తెలిపారు. దేశంలో ఇనుము, ఉక్కు రంగాల్లో జరుగుతున్న పరిశోధనలన్నింటినీ సమన్వయపరిచేందుకు, తద్వారా ఈ రంగంలో ఉన్నత స్థానానికి ఎదిగేందుకు స్టీల్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ మిషన్ ఆఫ్ ఇండియా పేరుతో ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ. వంద కోట్లు, ప్రైవేట్ కంపెనీలు మరో రూ.వంద కోట్లు అందించాయని, ఈ మూలధనంతో సంస్థ పనిచేస్తుందని చెప్పారు.

హైదరాబాద్‌లో గురువారం మిశ్రధాతు నిగమ్ (మిధాని), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెటల్స్‌లు ఏర్పాటు చేసిన జాతీయ సదస్సుకు మహంతి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోహాల తయారీలో భారత్ ఇతర దేశాలకు ఏమాత్రం తీసిపోదని, అయితే భవిష్యత్ అవసరాల దృష్ట్యా పరిశోధనలను ముమ్మరం చేసేందుకు కొత్త కేంద్రం ఉపకరిస్తుందన్నారు. భారత్ అభివృద్ధి చేస్తున్న యుద్ధ వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌లో ఉపయోగించిన ప్రత్యేకమైన ఉక్కు మొత్తం స్వదేశంలోనే తయారైందని మరే ఇతర దేశం ఇలాంటి ఘనత సాధించలేదని చెప్పారు.

సీఆర్‌జీవో స్టీల్ తయారీకి ఒప్పందం
విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లలో ఉపయోగించే సీఆర్‌జీవో ఉక్కు తయారీని దేశీయంగానే చేపట్టేందుకు మిశ్రధాతు నిగమ్ సెయిల్‌తో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ ఎం.నారాయణరావు తెలిపారు. ఏటా కొన్ని లక్షల టన్నుల సీఆర్‌జీవో ఉక్కును దిగుమతి చేసుకుంటున్నామని, సొంతంగా తయారు చేసుకుంటే విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుందని చెప్పారు. ఇందుకు తగ్గ వసతులు మిశ్రధాతు నిగమ్‌లో అందుబాటులోనే ఉన్నాయని అన్నారు. సెయిల్‌కు చెందిన భద్రావతి స్టీల్స్‌లో ఈ ప్రత్యేక ఉక్కును తయారు చేసి మిధానీలో దాన్ని మరింత అభివృద్ధి చేయవచ్చునన్నారు. కార్యక్రమంలో ఎన్‌ఎండీసీ సీఎండీ నరేంద్ర కొఠారీ, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డిప్యూటీ డెరైక్టర్ వెంకట కృష్ణన్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెటల్స్ డెరైక్టర్ అమోల్ గోఖలే తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement