టార్గెట్ వీవీఐపీ?
♦ ఢిల్లీలో తుపాకీతో పట్టుబడిన హైదరాబాద్‌వాసి
♦ విచారణలో నగరానికి చెందిన ఇద్దరి పేర్లు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: స్పెషల్ సెల్ బృందానికి ఢిల్లీలో తుపాకీతో పట్టుబడిన హైదరాబాద్‌వాసి తన టార్గెట్‌లో అత్యంత ప్రముఖుడు ఉన్నట్లు విచారణలో వెల్లడించాడు. తనకు నగరానికి చెందిన మరో ఇద్దరితో సంబంధాలున్నట్లు కూడా బయటపెట్టాడు. దీంతో శుక్రవారం హైదరాబాద్ చేరుకున్న ప్రత్యేక బృందం మదర్సాల నిర్వాహకులైన ఇరువురినీ అదుపులోకి తీసుకుని విచారించి విడిచిపెట్టింది. హైదరాబాద్‌కు చెందిన రెహ్మత్ పాషా ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీకి రైల్లో వస్తుండగా స్పెషల్ సెల్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనుమానాస్పదంగా ఉన్న అతడిని సోదా చేయగా తుపాకీ, తూటాలు లభించాయి. దీంతో అతడిని అరెస్టు చేసి విచారణ చేపట్టారు.
తన టార్గెట్‌లో దేశానికి చెందిన అత్యంత ప్రముఖుడు ఉన్నాడని, ఆయన్ని చంపడం కోసమే యూపీ నుంచి తుపాకీ, తూటాలు కొనుగోలు చేసినట్టు బయటపెట్టాడు. పాషా కాల్ డేటాను పరిశీలించిన అధికారులు హైదరాబాద్‌కు చెందిన మరికొందరితో పరిచయాలు ఉన్నట్లు, యూపీ నుంచీ వారితో సంప్రదింపులు జరిపినట్లు గుర్తించారు. ఈ కోణంలో రెహ్మత్‌ను ప్రశ్నించగా.. వారూ తమ ముఠాకు చెందిన వారేనని, ఆపరేషన్‌కు ఆర్థిక సాయం చేయడానికి అంగీకరించారని చెప్పుకొచ్చాడు. దీంతో ఓ ప్రత్యేక బృందాన్ని నగరానికి పంపారు. ఈ బృందం నగర పోలీసుల సహకారంతో నల్లకుంట, చింతల్‌మెట్‌లో ఉన్న మదర్సాల్లో సోదాలు చేసి వాటి నిర్వాహకులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.
రెహ్మత్ పాషా తమను సంప్రదించిన మాట వాస్తవమేనని, అయితే తుపాకీ కొనుగోలు, టార్గెట్ వీవీఐపీ ఆపరేషన్ వివరాలు తమకు తెలియవని స్పెషల్ సెల్ అధికారులకు వివరణ ఇచ్చారు. గతంలో యూపీ వెళ్ళిన రెహ్మత్.. బర్వేలీకి చెందిన ఓ మతపెద్ద చరిత్రను సేకరించానని చెప్పాడని, ఈ వివరాలను ప్రపంచానికి తెలియజేయడానికి ఓ వెబ్‌సైట్ పెట్టాలని యోచిస్తున్నానని, దీనికి ఆర్థిక సాయం కావాలని కోరాడని వారు తెలిపారు. దాని కోసమే తమను రెండుసార్లు కలవడంతో పాటు ఇటీవల యూపీ నుంచి ఫోన్లు చేసి రూ.20 వేలు అడిగినట్లు చెప్పారు. పాషా వెల్లడించిన విషయాలకు.. మదర్సా నిర్వాహకులు చెపుతున్న అంశాలకు పొంతన లేకపోవడంతో వీరి గత చరిత్రను స్పెషల్ సెల్ బృందం సేకరించింది. వీరికి ఎలాంటి వివాదాస్పద చరిత్ర లేదని నగర పోలీసులు తేల్చడంతో రెహ్మత్‌ను హైదరాబాద్ తీసుకువచ్చి విచారించాలని స్పెషల్ సెల్ అధికారులు భావిస్తున్నారు.