![రైస్‌మిల్లుపై టాస్క్‌ఫోర్స్ దాడులు](/styles/webp/s3/article_images/2017/09/4/81474393871_625x300.jpg.webp?itok=FwQDEvvb)
రైస్‌మిల్లుపై టాస్క్‌ఫోర్స్ దాడులు
కస్టమ్ మిల్లింగ్ బియ్యం మాయం
దీని విలువ రూ.1.80కోట్లుగా నిర్ధారణ
6ఏ కింద కేసు నమోదు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: 12వేల క్వింటాళ్లు.. రూ.1.80 కోట్ల విలువ.. నల్లగొండ జిల్లా కేంద్ర శివారులో ఉన్న ఓ రైస్‌మిల్లుపై పౌరసరఫరాల శాఖ టాస్క్‌ఫోర్స్ అధికారులు ఆకస్మిక దాడి జరిపితే కనిపించకుండా పోయిన కస్టమ్ మిల్లింగ్ బియ్యం (సీఎంఆర్) లెక్క ఇది. వివరాల్లోకి వెళితే... జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న ఆర్జాలబావి వద్ద సుమాంజలి పార్‌బాయిల్డ్ పేరిట ఓ రైస్‌మిల్లు నిర్వహిస్తున్నారు. ఈ మిల్లులో కస్టమ్ మిల్లింగ్ కోసం తీసుకున్న బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారని గత ఖరీఫ్ సీజన్‌లో కూడా ఆరోపణలు వచ్చాయి. అయితే, రబీ సీజన్‌లో తీసుకున్న బియ్యం కూడా ఇదే విధంగా పక్కదోవ పడుతుందన్న ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర స్థాయి టాస్క్‌ఫోర్స్ అధికారులు మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో మిల్లుపై దాడి చేశారు. టాస్క్‌ఫోర్స్ అధికారులు విద్యాసాగర్‌రెడ్డి, రాజేశంల నేతృత్వంలోని బృందం కస్టమ్ మిల్లింగ్ బియ్యాన్ని తనిఖీ చేసింది. ఈ తనిఖీల్లో మొత్తం 31,981 బస్తాల్లోని 12,792.40 క్వింటాళ్ల బియ్యం కనపడడం లేదని తేలింది. వాస్తవానికి ఈ మిల్లుకు ఇచ్చిన కోటా ప్రకారం 36,968 బస్తాల్లో 14,787 క్వింటాళ్ల బియ్యం ఉండాలని, కేవలం 4,987 బస్తాల్లోని 1994 క్వింటాళ్ల బియ్యం మాత్రమే ఉందని అధికారులు గుర్తించారు. కనపడకుండా పోయిన కస్టమ్ మిల్లింగ్ బియ్యం విలువ రూ.1.80 కోట్లకు పైగానే ఉంటుందని అధికారులు అంచనా వేశారు. సదరు మిల్లు నిర్వాహకులపై 6(ఏ) నిబంధన కింద కేసు నమోదు చేస్తున్నట్టు అధికారులు మీడియాకు వెల్లడించారు. ఈ దాడుల్లో జిల్లా పౌరసరఫరాల మేనేజర్ రాజేందర్, వాణిజ్య పన్నుల శాఖ అ«ధికారి రామనాథరావు, సహాయ పౌరసరఫరాల అధికారి శేషన్న, ఏజీపీవో ఆర్. చంద్రశేఖర్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్ రంగారావు, ఆర్‌ఐ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.