టీడీపీ-బీజేపీ ప్రచార ‘పంచాయితీ’!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ టీడీపీ, బీజేపీల మధ్య ఇప్పట్లో సయోధ్య కుదిరేలా కనిపించడం లేదు. వరంగల్ లోక్‌సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఈ రెండు పార్టీల తరఫున ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీకి చెందిన ఎన్నారై డాక్టర్ దేవయ్య అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆయనను ఎన్డీయే అభ్యర్థిగా ప్రచారం చేయాలని ముందు నుంచీ ఇరు పార్టీల నేతలు ప్రకటించినా... వాస్తవానికి వచ్చే సరికి ఈ రెండు పార్టీల నేతలు కలసి ప్రచారంలో పాల్గొనలేకపోతున్నారు. ఇరు పార్టీల మధ్య సమన్వయం కోసం ఇప్పటికే ఓ మారు సమావేశం నిర్వహించుకుని ఉమ్మడి ప్రచార వ్యూహాన్ని ఖరారు చేసినా అది కార్యరూపం దాల్చలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తెలంగాణ టీడీపీ నేతల నుంచి తమకు సరైన సహకారం, తోడ్పాటు అందడం లేదని తెలంగాణ కమలనాథులు టీడీపీ అధినేత చంద్రబాబుకు ఫిర్యాదు చేశారని సమాచారం. ఈనెల 21న వరంగల్ ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతుంది, 19 నాటికల్లా ప్రచారం ముగుస్తోంది. అంటే ప్రచారానికి కేవలం ఆరు రోజుల సమయమే మిగిలి ఉంది. అయినా ఇరు పార్టీల నేతలు కలసి ప్రచారం చేయడం లేదు.
సమన్వయమే సమస్య!
ముందు నుంచీ టీడీపీ, బీజేపీల మధ్య సమన్వయం పెద్ద సమస్యగా మారిందన్న అభిప్రాయం ఉంది. వరంగల్ జిల్లాకు చెందిన టీటీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు మినహా తెలంగాణ టీడీపీలో పేరున్న నేతలెవరూ పెద్దగా ప్రచారంపై దృష్టి పెట్టడం లేదు. ఈ పరిస్థితుల్లో బీజేపీ నేతలు ఫిర్యాదు చేయడంతో తమ పార్టీ నాయకులతో పాటు, వరంగల్ బీజేపీ అభ్యర్థి దేవయ్యను కూడా గురువారం విజయవాడకు పిలిపించుకున్న చంద్రబాబు... వారిని కూర్చోబెట్టి పంచాయితీని పరిష్కరించే ప్రయత్నం చేశారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. సార్వత్రిక ఎన్నికలప్పుడు వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో రెండు చోట్ల టీడీపీ విజయం సాధించింది.
దాంతో క్షేత్ర స్థాయిలో బీజేపీ కన్నా తమ పార్టీ పరిస్థితే మెరుగ్గా ఉందని, టికెట్ తమకే ఇవ్వాలని టీడీపీ పట్టుబట్టినా బీజేపీ వినలేదు. ఈ గొడవ ఇప్పటికీ కొనసాగుతుండడంతో బీజేపీ నాయకులు ఫిర్యాదు చేయక తప్పలేదంటున్నారు. అసలు బీజేపీ అభ్యర్థి తరఫున ప్రచారం చేయడానికి టీడీపీ వ్యూహ రచన కూడా చేసుకుంది. ఏడు సెగ్మెంట్లకు తొమ్మిది జిల్లాల నాయకులకు బాధ్యతలు అప్పజెప్పింది. కానీ అది పెద్దగా కార్యరూపం దాల్చినట్లు లేదంటున్నారు.
మరోవైపు ఆ పార్టీ కార్యకర్తలకు కూడా కనీస పరిచయం లేని వ్యక్తికి టికెట్ కేటాయించిన బీజేపీ... ఎన్నికల్లో ఓడిపోతే ఆ నెపం తమపై నెట్టివేయడానికి ముందు నుంచే తాము సహకరించడం లేదంటూ అభియోగం మోపుతోందని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. టికెట్ కోసం పట్టుబట్టిన బీజేపీ.. డబ్బున్న వ్యక్తిని చూసింది కానీ, నియోజకవర్గ ఓటర్లకు తెలిసిన వాడా, కార్యకర్తలతో కనీస పరిచయాలు ఉన్నాయా లేదా అనేది పట్టించుకోలేదని ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న టీడీపీ రాష్ట్ర స్థాయి నాయకులు వ్యాఖ్యానించడం గమనార్హం. మొత్తానికి ఎన్నికల ప్రచారం ముగింపు దశకు వచ్చినా, ఇంకా ఈ రెండు పార్టీల మధ్య సయోధ్య కుదరక పోవడంపై చర్చ జరుగుతోంది.