శిల్పా వర్గీయుడు నాగేశ్వరరెడ్డిపై దాడికి యత్నిస్తున్న భూమా వర్గానికి చెందిన భాస్కర్‌రెడ్డి
‘జన్మభూమి’లో తమ్ముళ్ల కుమ్ములాట
Published Sun, Jan 8 2017 9:55 PM | Last Updated on Tue, Oct 2 2018 6:46 PM
- పోలూరు గ్రామ సభలో భూమా, శిల్పా వర్గీయుల ఘర్షణ
నంద్యాల రూరల్: జన్మభూమి సభ వేదికగా తెలుగు దేశం పార్టీ నేతలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. నంద్యాల మండలం పోలూరు గ్రామంలో ఆదివారం సర్పంచ్ దివాకర్ అధ్యక్షతన గ్రామ సభ ప్రారంభమైంది. వ్యవసాయాధికారి అయూబ్‌బాషా మాట్లాడుతుండగా ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి వర్గానికి చెందిన భాస్కర్‌రెడ్డి అడ్డుకొని తమకు సబ్సిడీ పైపులు ఇవ్వకుండా శిల్పా వర్గానికి ఇవ్వడం ఏమిటని నిలదీశారు. జన్మభూమి కమిటీ సభ్యులుగా వేదికపై కూర్చున్న శిల్పా వర్గీయుడు ఎం. నాగేశ్వరరెడ్డిపై దాడి చేశాడు ‘నీవల్లే మా వర్గానికి అన్యాయం జరిగింది’ అని సభలోనే కాలితో తన్నారు. తహసీల్దార్ కార్యాలయ అటెండర్, ఏఓ మరికొందరు అడ్డుకున్నారు. వెంటనే తహసీల్దార్ శివరామిరెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు జోక్యం చేసుకొని నాగేశ్వరరెడ్డిని సముదాయిస్తుండగా భూమావర్గీయులు మళ్లీ దాడి చేశారు. గ్రామసభలోనే చొక్కాపట్టుకొని చుట్టుముట్టి కొట్టడంతో మరింత ఉద్రిక్తతగా మారింది. శిల్పా వర్గం నాయకులు కూడా భూమావర్గంపై ఎదురు దాడికి దిగారు. దీంతో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. గొడవ తీవ్రస్థాయి చేరి ఒకరిపై ఒకరు రాళ్లు, చెప్పులు విసురుకున్నారు.పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ఏఎస్‌ఐ దేవేంద్ర కుమార్ సమాచారం అందివ్వడంతో రూరల్ ఎస్‌ఐ గోపాల్‌రెడ్డి హుటాహుటిన అదనపు పోలీసులతో పోలూరుకు చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపు చేశారు. గ్రామంలో తాత్కాలిక పోలీస్ పికెట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Advertisement
Advertisement