
కలమల్లలో టీడీపీ వర్గీయుల దౌర్జన్యం
– వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సుందరమ్మ కుటుంబ సభ్యులపై దాడి
–ప్రాణ భయంతో సుధీర్‌రెడ్డి ఇంటికి చేరిన సుందరమ్మ, భర్త రమేష్
–టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని ఒత్తిడి చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు
ఎర్రగుంట్ల: అధికార దాహంతో.. ఎలాగైనా శాసన మండలి ఎన్నికల్లో గెలవాలని.. ఇందుకోసం ప్రత్యర్థులను బెదిరించి, భయపెట్టి ఓట్లను పొందాలని టీడీపీ వర్గీయులు కుయుక్తులు పన్నుతున్నారు. ఇందుకు నిదర్శనం ఆదివారం రాత్రి కలమల్లలోని కృష్ణానగర్‌లో చోటుచేసుకున్న ఘటనే. టీడీపీ వర్గీయులైన వెంకటేష్, కృష్ణయ్య తమ కుటుంబ సభ్యులపై దాడి చేశారని వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యురాలైన సుందరమ్మ, ఆమె భర్త రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
టీడీపీలోకి రావాలంటూ ఒత్తిడి
ఈ సందర్భంగా ఎంపీటీసీ సభ్యురాలు సుందరమ్మ, ఆమె భర్త రమేష్ మాట్లాడుతూ కలమల్లలోని కలమల్ల–3 ఎంపీటీసీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచినట్లు తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నామని చెప్పారు. అయితే శాసన మండలి ఎన్నికలలో టీడీపీకి అనుకూలంగా ఉండాలని గ్రామానికి చెందిన వెంకటేసు, కృష్ణయ్య ఒత్తిడి చేస్తున్నారని వారు వాపోయారు. తాము వైఎస్సార్‌సీపీని వీడి టీడీపీలోకి వచ్చే ప్రసక్తే లేదని తెలిపినట్లు చెప్పారు. దీంతో ఆదివారం రాత్రి పదే పదే ఫోన్ చేసి చేసి బెదిరించినట్లు తెలిపారు. అలాగే తమ అత్తమామలైన సుందరమ్మ, రామాంజనేయులు, ఆడబిడ్డ వాణిపై దాడి చేసి బెదిరించారని ఎంపీటీసీ సభ్యురాలు తెలిపారు. దీంతో ప్రాణ భయంతో వైఎస్సార్‌సీపీ జమ్మలమడుగు నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ ఎం.సుధీర్‌రెడ్డికి తెలియజేయడంతో.. ఆయన వెంటనే స్పందించి తమకు భరోసా ఇచ్చారని వారు పేర్కొన్నారు. అదే రాత్రి భయంతో వారు నిడుజివ్వి గ్రామంలోని ఎం.సుధీర్‌రెడ్డి ఇంటికి వచ్చినట్లు తెలిపారు.
రక్షణ కల్పించాలి
ఈ విషయం తెలుసుకున్న కలమల్ల ఎస్‌ఐ రవికుమార్ నిడుజివ్వికి వచ్చి ఎంపీటీసీ సభ్యురాలైన సుందరమ్మ, ఆమె భర్త రమేష్‌తో మాట్లాడారు. గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు వెంకటేసు, కృష్ణయ్య తమ కుటుంబ సభ్యులను బెదిరించి దాడికి దిగారని ఫిర్యాదులో పేర్కొన్కారు. వీరతో ప్రాణ భయం ఉందని, తమకు రక్షణ కల్పించాలని కోరారు.
ఎస్‌ఐ వివరణ
ఈ విషయంపై కలమల్ల ఎస్‌ఐ రవికుమార్ వివరణ కోరగా.. ఎంపీటీసీ సభ్యురాలు సుందరమ్మ, ఆమె భర్త రమేష్ తమ కుటుంబ సభ్యులపై టీడీపీ వర్గీయులైన వెంకటేసు, కృష్ణయ్య దాడికి తిగినట్లు ఫిర్యాదు చేశారని చెప్పారు. అయితే అలాగే ఎంపీటీసీ సభ్యురాలు సుందరమ్మ అత్త మామ, ఆడబిడ్డలను విచారణ చేయగా.. వారు తమపై ఎవరూ దాడి చేయలేదని ఫిర్యాదు చేశారని ఎస్‌ఐ పేర్కొన్నారు. ఇరువురు ఇచ్చిన ఫిర్యాదులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లినట్లు చెప్పారు. విచారణ చేసి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని వివరించారు.