టీడీపీ జిల్లా అధ్యక్షుల మార్పు?
సాక్షి, హైదరాబాద్: ఏపీ రాష్ట్రంలోని పలు జిల్లాల పార్టీ అధ్యక్షులను మార్చాలని తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. త్వరలో జిల్లా అధ్యక్షులను మార్చే అవకాశం ఉంది. గతేడాది ఏప్రిల్, మే నెలల్లో జరిగిన జిల్లా మహానాడుల్లో వీరిని అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. అలా ఎన్నికైన వారిలో ఎక్కువ మంది ఎమ్మెల్సీలుగా మారారు. మరికొందరు అంతకు ముందు జరిగిన సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యేలయ్యారు. వీరు పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెట్టక పోవడం, కనీసం సమావేశాలు కూడా నిర్వహించలేని పరిస్థితి నెలకొనడంతో అధ్యక్షులను మార్చాలని చంద్రబాబు యోచిస్తున్నారు.
ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా ఉన్న గౌనివారి శ్రీనివాసులు నాయుడు (చిత్తూరు), చక్రపాణిరెడ్డి (కర్నూలు), బుద్ధా వెంకన్న(విజయవాడ అర్బన్), జగదీష్ (విజయనగరం) రవిచంద్ర యాదవ్(నెల్లూరు) ఆయా జిల్లాలకు అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. ఎమ్మెల్యేలు పార్థసారథి (అనంతపురం), జనార్దన్(ప్రకాశం), వాసుపల్లి గణేష్ కుమార్ (విశాఖ అర్బన్) జిల్లా అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. రాజ్యసభ సభ్యురాలు తోట సీతామాలక్ష్మి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుల మార్పుపై బుధవారం విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రి యనమల పాల్గొన్నారు.
జిల్లా అధ్యక్షులుగా ఎవరిని ఎంపిక చేస్తే బాగుంటుందో తమకు ఒక నివేదిక ఇవ్వాల్సిందిగా పార్టీ కార్యక్రమాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ వీవీవీ చౌదరికి చంద్రబాబు సూచించారు. వీవీవీ చౌదరి జిల్లాల వారీగా రెండు, మూడు పేర్లతో నివేదికలు రూపొందించి చంద్రబాబుకు అందిస్తారని సమాచారం. తునిలో జరిగిన విధ్వంసంపై ఈ సమావేశంలో చర్చించారు. మార్చి 1 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈ వ్యవహారం అంతా వైఎస్సార్‌సీపీ చుట్టూ తిరిగేలా ఏం చేస్తే బాగుంటుందనే అంశంపై సమాలోచన జరిపారు. సమావేశాలు ప్రారంభమయ్యేలోగా తుని ఘటనలో ఎఫ్‌ఐఆర్‌లో పేర్లున్న వైఎస్సార్‌సీపీ నేతలను అరెస్టు చేసి హడావిడి చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.