
టీడీపీ నేత కిడ్నాప్.. హైడ్రామా!
► రూ. 3 కోట్ల డిమాండ్
► రూ. 50 లక్షలకు కుదిరిన బేరం
► పోలీసుల జోక్యంతో విడుదలైన భజలింగం
యాదమరి/పలమనేరు/చిత్తూరు (అర్బన్): చిత్తూరు జిల్లా యాదమరి మండలానికి చెందిన టీడీపీ నాయకుడు భజలింగాన్ని గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. హైడ్రామా అనంతరం పలమనేరు సమీపంలోని మొగిలి ఘాట్‌లో వదిలేశారు. పోలీసుల కథనం మేరకు యాదమరి మండలం గోందివాళ్ల గ్రామానికి చెందిన భజలింగం తమిళనాడులోని పరదరామి నుంచి స్కార్పియో వాహనంలో ఇంటికి వస్తున్నాడు. పాచిగుంట గ్రామం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు కారుతో వాహనాన్ని అడ్డగించి కళ్లలో కారం కొట్టి కిడ్నాప్ చేశారు. అనంతరం అతన్ని పలమనేరు సమీపంలోని మొగిలి అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి తీవ్రంగా గాయపరిచారు.
రూ.3 కోట్లు ఇస్తే భజలింగంను వదిలేస్తామని, లేకుంటే చంపేస్తామని వారి కుమారులకు ఫోన్‌లో తెలిపారు. మంగళవారం రాత్రంతా బేరసారాలు ఆడి చివరకు రూ.50 లక్షలకు సెటిల్ చేసుకున్నారు. నగదును పలమనేరు అటవీ ప్రాంతంలోని మొగిలి ఘాట్‌లో వాహనంలో ఉంచి వెళ్లాలని చెప్పడంతో భజలింగం కుమారులు అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలోనే బాధితుడి కుమారుడు నిత్యానందం 100కు డయల్ చేసి విషయం పోలీసులకు తెలిపారు. గంగవరం మొబైల్ పార్టీ పోలీసులు మొగిలిఘాట్ వద్దకు చేరుకున్నారు.
దుండగులు ఈ విషయాన్ని గమనించి భజలింగాన్ని, వాహనాన్ని వదిలేసి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని గంగవరం పోలీసులు చిత్తూరు ఆస్పత్రికి తరలించారు. భజలింగం కుమారులు గోవర్ధన్, నిత్యానందం డబ్బులు తీసుకుని మొగిలిఘాట్ వద్ద కిడ్నాపర్లలో ఒకడికి ఇచ్చాడని, అయినా తండ్రిని వదలకపోవడంతో నిత్యానందం ఫోన్ చేశాడని పోలీసులు చెబుతున్నారు.
పాత నేరస్తులపైనే అనుమానం
భజలింగం కిడ్నాప్‌లో పాత నేరస్తులపై పోలీసులు అనుమానిస్తున్నారు. 2014, 2015లో జిల్లాలో జరిగిన పలు కిడ్నాప్‌లకు సంబంధించి ఆరితేరిన ముఠానే తాజా ఘటనకు కారణంగా భావిస్తున్నారు. బుధవారం భజలింగం చిత్తూరు ఆస్పత్రిలో మీడియాతో మాట్లాడుతూ తాను మంగళవారం పరదరామి నుంచి కారులో వస్తుండగా కొందరు దుండగులు రోడ్డుకు అడ్డంగా కారు పెట్టి అడ్డగించారని తెలిపారు. అనంతరం తనను పలమనేరు అడవుల్లోకి తీసుకెళ్లి రూ.3 కోట్లు డిమాండ్ చేసినట్లు చెప్పాడు. ఈ వివరాలు గత ఏడాది జూన్‌లో చిత్తూరు పోలీసులు అరెస్టు చేసిన కిడ్నాప్ ముఠా చెప్పిన విషయాలతో సరిపోలడంతో పాత నేరస్తులకు ఇందులో సంబంధాలు ఉన్నాయనే అనుమానాలు బలోపేతమవుతున్నాయి.