
కబ్జాలకు అడ్డేది..!
అనంతపురం న్యూసిటీ: మున్సిపల్ చట్టం 2005 ప్రకారం నగరపాలక సంస్థ ఆస్తులు అన్యాక్రాంతం కాకూడదు. వాటిని ఎవరూ కొనుగోలు చేయకూడదు. కానీ నగరంలో అధికార పార్టీ అండదండలతో కొందరు నేతలు ఇష్టారాజ్యంగా కబ్జాలకు పాల్పడుతున్నారు. రూ. కోట్లు విలువచేసే స్థలాలు అన్యాక్రాంతం చేస్తున్నారు.
ఈ చిత్రంలో కనిపిస్తున్నది నగరంలోని 32వ డివిజన్‌లోని హౌసింగ్‌బోర్డు ఎల్‌పీ నంబర్ 3/98కు సంబంధించి 20 సెంట్ల స్థలం. స్థానికంగా ఉండే ఓ టీడీపీ నేత ఇక్కడ నిర్మాణాన్ని చేపట్టాడు. ఏనాడు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు అటువైపు చూసిన దాఖలాలు లేవు. ఈ స్థలం విలువ రూ.కోటి వరకు ఉండవచ్చని అధికారుల అంచనా.
ఈ చిత్రం ఆదర్శనగర్‌లోనిది. శాంతిసేన సహకార బంధువు అనే స్వచ్ఛంద సంస్థ...నగరపాలక సంస్థకు చెందిన 5 సెంట్లలో షెడ్డును ఏర్పాటు చేసింది. తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ నేత ఈ స్వచ్ఛంద సంస్థను ప్రారంభించాడు. ఈ స్థలం విలువ రూ. 30 లక్షల వరకు ఉంటుందని నగరపాలక సంస్థ అధికారులే చెబుతున్నారు.
నగరపాలక సంస్థలోని పాలకవర్గంలోని కొందరి నేతల ఆగడాలకు అడ్డూ అదుపు లేదనడానికి పై చిత్రమే ఓ ఉదాహరణ. 27వ డివిజన్ కార్పొరేటర్ సరిపూటి రమణ తన ఇంటి ముందున్న రోడ్డును ఆక్రమించాడు. అక్కడ ఏకంగా టీడీపీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశాడు. ఆ కార్యాలయంలో ప్రస్తుతం తన వాహనాలను పార్క్ చేస్తున్నాడు.