దళిత రైతుపై అటవీశాఖ అరాచకం
దళిత రైతుపై అటవీశాఖ అరాచకం
Published Mon, Aug 22 2016 9:49 PM | Last Updated on Fri, Aug 10 2018 9:46 PM
అర్ధరాత్రి మామిడి తోట నరికివేత
టీడీపీ నాయకులు చెప్పారని వెల్లడి
రేంజర్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ నేతల ఆగ్రహం
బత్తులవారిగూడెం(నూజివీడురూరల్) :
అధికార పార్టీ నాయకులు చెప్పారని అటవీశాఖ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి దళితరైతుకు చెందిన భూమిలోని మామిడి చెట్లను రాత్రిపూట దొంగచాటుగా కొట్టేశారు. మండలంలోని బత్తులవారిగూడెంకి చెందిన కోలగంటి సుబాకర్‌రావు తన రెండెకరాల భూమిలో పదేళ్ళక్రితం మామిడి చెట్లను వేశారు. శనివారం రాత్రి అటవీశాఖ సిబ్బంది ఆ తోటలోకి అక్రమంగా ప్రవేశించి 25 మామిడి చెట్లను నరికేశారు. ఆదివారం తోటకెళ్లిన బాధితుడు నరికేసిన చెట్లను చూసి హతాశుడయ్యాడు. అక్కడ పలువురి మామిడి తోటలు ఉన్నా ఆయన తోటనే టార్గెట్ చేసుకున్నారు. ఈ విషయాన్ని వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు మందాడ నాగేశ్వరరావు, వైఎస్సార్‌సీపి నాయకుడు బత్తుల మాధవరావు, జెడ్పీటీసి బాణావతు రాజు దృష్టికి తేగా వారు తోటను పరిశీలించారు.
నిలదీసిన వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు
నూజివీడు అటవీశాఖ కార్యాలయంలో రేంజర్ బీ శ్రీరామారావును సోమవారం ఉదయం కలిసి ఇదేం దౌర్జన్యం అని నిలదీశారు. కొంతమంది గ్రామస్తులు ఫిర్యాదు చేయడం వల్లే నరికి వేశామని రేంజర్ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. మేము ఫిర్యాదు చేస్తే అలాగే నరికేస్తారా? అని నిలదీశారు. ఐదేళ్ళ క్రితం ఇదే రైతు భూమిలోని మామిడి చెట్లను ఇలాగే కొట్టేస్తే కోర్టు కేసులో బాధితుడికి అనుకూలంగా తీర్పు వచ్చిందని రేంజర్ దృష్టికి తెచ్చారు. ఎవరో టీడీపీ నాయకులు చెప్పారని రాత్రిపూట దొంగల్లాగా తోటలోకి చొరబడి అరాచకం చేయడం ఏమిటని వైఎస్సార్‌సీపీ నాయకులు ధ్వజమెత్తారు. మంగళవారం ఉదయం నిరికివేసిన మామిడి తోటను పరిశిలించి భాధిత రైతుకు తగు న్యాయం చేస్తానని రేంజర్ తెలపడంతో నేతలు కొంత శాంతించారు. ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అటవీశాఖ అధికారుల వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
Advertisement
Advertisement